వేదఘోషతో పులకించిన రత్నగిరి

ABN , First Publish Date - 2022-05-15T05:19:03+05:30 IST

సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం రత్నగిరి వేదఘోషతో పులకించింది.

వేదఘోషతో పులకించిన రత్నగిరి
వేద పారాయణం నిర్వహిస్తున్న దృశ్యం

  కొనసాగుతున్న కల్యాణోత్సవాలు
అన్నవరం, మే 14: సత్యదేవుడి దివ్య కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం రత్నగిరి వేదఘోషతో పులకించింది. మధ్యాహ్నం 2 గంటలకు అనివేటి మండపం వద్దకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను, పెండ్లిపెద్దలైన సీతారాములను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన వేదికపై ఆశీనులు గావించి ప్రధానార్చకులు కోట శ్రీను, ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, విశేష అర్చనలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన నిష్ణాతులైన వేద పండితులు తమ పాండిత్యాన్ని, అభ్యసించిన వేదవిద్యను నవదంపతుల సమక్షంలో వినిపించడంతో ఆలయ ప్రాంగణమంతా వేదఘోషతో మార్మోగింది. పండితులంతా నవదంపతులకు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ కార్యక్రమానికి విచ్చేసిన 147 మంది పండితులను నగదు, మధురఫలాలు, విసినకర్ర తదితర వాటిని అందజేసి ఘన సత్కారం చేశారు.
పొన్నవాహనంపై నవదంపతులు
గ్రామోత్సవాల్లో భాగంగా రాత్రి 9గంటలకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను కొండపై నుంచి పల్లకిలో తొలిపావంచా వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ సర్వాంగసుందరంగా పుష్పాలంకరణతో తీర్చిదిద్దిన పొన్నవాహనంపై నవదంపతులను ఆశీనులు గావించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగింపు జరిగింది. ఈ గ్రామోత్సవాన్ని తిలకించేందుకు అన్నవరం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గ్రామోత్సవాల్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పీఆర్వో కొండలరావు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.

Read more