-
-
Home » Andhra Pradesh » Do you give plans to yourself-NGTS-AndhraPradesh
-
ఉన్నోళ్లకే పథకాలు ఇస్తారా?
ABN , First Publish Date - 2022-05-14T08:51:53+05:30 IST
ఉన్నోళ్లకే పథకాలు ఇస్తారా?
పేదలను పట్టించుకోవడం లేదు.. అర్హతలున్నా పెన్షన్లు ఇవ్వరేం?
వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీసిన జనం.. గడప గడపలో నిరసనలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ నిరసనలు ఎదురవుతున్నాయి. శుక్రవారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని అనుగొండలో మహిళలు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ‘పేదలను పట్టించుకోవడం లేదు. ఉన్నోళ్లకే పథకాలు ఇస్తున్నారు. మాలాంటి పేదలు మొరపెట్టుకుంటున్నా పెడచెవిని పెడుతున్నారు’ అని విమర్శించారు. తాము కూలీనాలీ చేసుకుని బతుకుతున్నామని.. సెంటు పొలం లేకున్నా స్థలాలు మంజూరు చేయడం లేదని మునేశ్వరి, వెంకటేశ్వరమ్మ, పెద్దక్క-రంగన్న దంపతులు తెలిపారు. అమ్మఒడి అందలేదని లక్ష్మీదేవి, నరహరి చెప్పారు. సర్పంచ్ మాదమ్మ జోక్యం చేసుకుని తర్వాత మాట్లాడుకుందామని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. పథకాలు అందకపోవడంపై వలంటీర్ల వివరణ తీసుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నించారు. అయితే వారు అక్కడ కనిపించకపోవడంతో మండిపడ్డారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని జరజాపుపేటలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సురేశ్‌బాబు పర్యటించారు. ‘సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది’ అని ఎమ్మెల్యే ఆరాతీశారు. కొన్నిచోట్ల మహిళల నుంచి నిరసన వ్యక్తమైంది. తన అత్తకు అర్హత ఉన్నా పింఛన్ మంజూరు కాలేదని అవనాపు చిట్టమ్మ అనే మహిళ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ పిల్లలకు అమ్మ ఒడి రాలేదని మద్దిల వెంకటలక్ష్మి చెప్పింది. మిల్లు లాకౌట్ జరిగి 3 నెలలు కావస్తున్నా తెరిపించడానికి ఎందుకు జోక్యం చేసుకోలేదని నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మికుడు బొలే కృష్ణమూర్తి ప్రశ్నించారు.
పథకాలా.. వలంటీర్లు ఇస్తున్నారు!
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మూడో వార్డు గుమడాంలో ఉపముఖ్యమంత్రి రాజన్నదొర ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. ‘పథకాలు అందుతున్నాయా? ఇవి ఎవరు ఇస్తున్నారు’ అని ప్రశ్నించారు. ‘పథకాలా.. మాకు వలంటీర్లు ఇస్తున్నారు’.. అని ఓ మహిళ చెప్పడంతో ఆయన అసహనానికి గురయ్యారు. వలంటీర్లు పథకాలు ఇవ్వరని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇస్తేనే మీకు అందుతున్నాయని తెలిపారు.
కాపు నేస్తం నిలిపేశారు..
శుక్రవారం అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బుచ్చెయ్యపేట మండలం చింతపాక, సీతయ్యపేట వెళ్లగా.. మహిళలు కొందరు తమకు ‘కాపు నేస్తం’ పథకం నిలిపివేశారని ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలున్నా పింఛన్ మంజూరు చేయడం లేదని కొల్లిమళ్ల ముసలమ్మ వాపోయింది. వృద్ధాప్యం కారణంగా తన వేలిముద్రలు, ఐరిస్ పడకపోవడంతో 6 నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదని సలాది గంగమ్మ విలపించింది. అర్హులందరికీ పథకాలు మంజూరుచేయడానికే తాను వచ్చానని చెప్పి ఎమ్మెల్యే ముందుకు సాగారు.

