-
-
Home » Andhra Pradesh » Dandupalya batch in Visakhapatnam-NGTS-AndhraPradesh
-
విశాఖలో దండుపాళ్యం బ్యాచ్!
ABN , First Publish Date - 2022-05-07T09:23:12+05:30 IST
విశాఖ నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న విద్యార్థిపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో..
పదో తరగతి విద్యార్థిపై కత్తులతో దాడి
మహారాణిపేట (విశాఖపట్నం), మే 6: విశాఖ నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న విద్యార్థిపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం మేరకు.. రెల్లివీధికి చెందిన బాలుడు (17) ఇక్కడి ఓ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం వన్‌టౌన్‌లోని ఓ బాలికల ఉన్నత పాఠశాలలో సోషల్ పరీక్ష రాసి ఇంటికి వెళ్లేందుకు మిత్రులతో కలిసి ఆటో ఎక్కుతుండగా నలుగురు కత్తులతో దాడి చేశారు. దీంతో బాలుడు సమీపంలోనే గల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లోకి పరుగులు తీశాడు. అది చూసి దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఏవీఎన్ కళాశాల ప్రాంతంలో దండుపాళ్యం ముఠాగా చెప్పుకుని తిరుగుతున్న బ్యాచ్‌కు చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఒక దాడి ఘటనలో ఈ బాలుడిపై హత్యాయత్నం కేసు ఉందని చెబుతున్నారు. కాగా.. కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న బాలుడు మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ నుంచి తనను పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి పంపకుండా ఆటో ఎక్కించి ఇంటికి పంపేశారని ఆరోపించాడు. దీనిపై వన్‌టౌన్ సీఐ వెంకటనారాయణను వివరణ కోరగా గాయాలతో వచ్చిన బాలుడిని హెడ్ కానిస్టేబుల్ సహాయంతో పంపించినట్టు తెలిపారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, పాత కక్షలతోనే దాడి జరిగి ఉండవచ్చని తెలిపారు.

