-
-
Home » Andhra Pradesh » Chittoor » Positions with performance-NGTS-AndhraPradesh
-
పనితనంతోనే పదవులు!
ABN , First Publish Date - 2022-05-14T07:36:50+05:30 IST
ఎంతవారైనా పనితనంతోనే పార్టీలో పదవులు లభిస్తాయని, కొత్తగా పదవులు ఇచ్చినవారు పనిచేయకపోతే ఆ పదవులు ఊడుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరికీ ఒక ఫోన్ నెంబరు
వాటిద్వారానే పనితీరు మదింపు
కార్యకర్తల ఆదాయానికి ప్రణాళిక
పార్టీ కన్వీనర్లు, యువత సమావేశంలో చంద్రబాబు
కుప్పం, మే 13: ఎంతవారైనా పనితనంతోనే పార్టీలో పదవులు లభిస్తాయని, కొత్తగా పదవులు ఇచ్చినవారు పనిచేయకపోతే ఆ పదవులు ఊడుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం పార్టీ బూత్, యూనిట్, క్లస్టర్ కన్వీనర్లతోను, యువతతోనూ చంద్రబాబు వేర్వేరుగా సమావేశమయ్యారు. కొత్తగా పదవులు పొందిన వారు, ఆయా పదవుల్లో ఉన్నవారు నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సాధకబాధకాలు తెలుసుకుని, పార్టీని గ్రామగ్రామానా విస్తరించి పటిష్ఠం చేయాలన్నారు. లేదంటే పదవులు కోల్పోతారని హెచ్చరించారు. పనితీరు మాత్రమే పదవులను కట్టబెడుతుంది తప్ప ఎవరి సిఫార్సులు, రెకమండేషన్లు పనిచేయవన్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక ఓటరును పార్టీ సభ్యుడిగా చేర్పించాలని లక్ష్యం విధించారు. దీనిపై కన్వీనర్ల వ్యవస్థ దృష్టి పెట్టాలన్నారు. కన్వీనర్ల ఫోన్ నెంబర్లను అనుసంధానిస్తానని, పార్టీ విషయమైనా, ప్రజల కష్టాలైనా, పనితీరు గురించైనా ఈ వ్యవస్థ ద్వారానే తెలుసుకుంటానన్నారు. వ్యవస్థ కట్టు తప్పుతున్నట్లు అనిపిస్తే ప్రక్షాళన చర్యలు చేపట్టి సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పార్టీకోసం పనిచేసే కార్యకర్తల ఆర్థిక స్తోమత పెంచడం, వారికి ఆదాయ మార్గం చూపడం కూడా తన బాధ్యతేనన్నారు. దీనికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నానని ప్రకటించారు. పార్టీకోసం పనిచేస్తూనే వారు స్వయం ఉపాధి పొందే మార్గాల గురించి ఆలోచించి అమలు చేస్తానని చెప్పారు.
సీనియర్లు ఇక సలహాదారులే
పార్టీలోని సీనియర్లు పనిచేసినంతకాలం పనిచేశారని, వారిక సలహాదారులుగానే కొనసాగుతారని చంద్రబాబు స్పష్టం చేశారు. సీనియర్ల పేర్లను ప్రస్తావిస్తూ వారంతా ఇక కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తారన్నారు. ఇంతకుముందు తాను తప్పు చేశానని, ఎవరో సీనియర్లు చెప్పేవారికి, వారు సూచించే వ్యక్తులకు పదవులిచ్చి, పార్టీని ఈ స్థితికి తెచ్చుకున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు కూడా తన చుట్టూ తిరుగుతూ, తన ప్రాపకంకోసం అర్రులు చాచేవారన్నారు. తిరిగి చూసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. ఇకపై అలా జరగదని, అటువంటి తప్పులు చేయనని స్పష్టంచేశారు. ప్రజల్లో ఉండేవారెవరో తెలుసుకుని వారిని పిలిచి తనపక్కన సీట్లో కూచోబెట్టుకుంటానన్నారు. ఇతర పార్టీలనుంచి వచ్చేవారిని, ముఖ్యంగా యువతను సాదరంగా ఆహ్వానించాలన్నారు. అందువల్ల ఇప్పటికే పార్టీలో కష్టపడుతున్న వారికి ఎటువంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. పార్టీ జెండా మోసేవారికి ఎప్పటికీ విలువ, ప్రాధాన్యమిస్తానని అన్నారు.
ముగిసిన బాబు పర్యటన
చంద్రబాబు మూడు రోజుల పర్యటన శుక్రవాఆరం ముగిసింది. చివరి రోజున ఉదయం ఆర్అండ్బీ అతిథి గృహంలో షాహీ గార్మెంట్స్ మహిళా కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. సామరస్యపూర్వక పరిష్కారానికి చర్చలు జరిపారు. ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. విలేకరులతో కాసేపు ముచ్చటించారు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి కడపల్లె వద్ద ఇంటి నిర్మాణానికి గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. 3 గంటలకు గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెలోని మాజీ ఎంపీపీ మునిరాజు ఇంటికి వెళ్లారు. ఇటీవల మరణించిన ఆయన సోదరుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మూడున్నర గంటలకు కుప్పంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చి పరిశీలించారు. 4 గంటలకు బీసీఎన్ కల్యాణ మండపంలో పార్టీ బూత్, యూనిట్, క్లస్టర్ కన్వీనర్లతోను.. ఆరు గంటలకు వాణీ మహల్లో యువతతో సమావేశమయ్యారు. 7.30 గంటలకు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
ఇంటి స్థలాన్ని పరిశీలించిన బాబు
కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకోనున్నారన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. శాంతిపురం మండలం కడపల్లె, కనమలదొడ్డి మధ్యలో శివపురం ఎదురుగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 2.10 ఎకరాల స్థలాన్ని స్థానిక నాయకులు ఎంపిక చేశారు. దీనిని శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, స్థలం సొంతదారు తదితరులు వెంట ఉన్నారు. స్థలాన్ని పరిశీలించిన బాబు సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు పావు గంటసేపు అక్కడే గడిపి తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. స్థలం కొనుగోలు పత్రాలపై చంద్రబాబు గురువారమే సంతకాలు పెట్టిన విషయం తెలిసిందే.

