గగనయాన్‌కు ఇస్రో తొలి అడుగు

ABN , First Publish Date - 2022-05-14T07:29:52+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్‌) ప్రయోగానికి తొలి అడుగు వేసింది.

గగనయాన్‌కు ఇస్రో తొలి అడుగు
పరీక్షకు ముందు శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

 షార్‌లో హెచ్‌ఎస్‌ 200 బూస్టర్‌ భూస్థిర పరీక్ష విజయవంతం 

 ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఘన ఇందన బూస్టర్‌ సామర్ధ్యాన్ని సాధించిన ఇస్రో 


శ్రీహరికోట (సూళ్లూరుపేట), మే 13 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్‌) ప్రయోగానికి తొలి అడుగు వేసింది. ఈ ప్రయోగంలో ఉపయోగించనున్న లాంచ్‌ వెహికల్‌ మాడ్యూల్‌-3 (ఎల్‌విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్‌ హెచ్‌ఎస్‌-200కు ఇస్రో శుక్రవారం భూస్థిర పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.శ్రీహరికోట సతీష్‌థావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లో శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఈ పరీక్ష జరిగింది. 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెచ్‌ఎస్‌-200 బూస్టర్‌లో 203 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి షార్‌లోని ఎస్‌ఎంపీసీ విభాగంలో భూస్థిర పరీక్షను నిర్వహించారు. శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా ఈ బూస్టర్‌ 135 సెకండ్ల పాటు విజయవంతంగా పనిచేసినట్లు ఇస్రో వెల్లడించింది. 700 పారామీటర్లతో ఈ బూస్టర్‌ పనితీరును పరీక్షించినట్లు పేర్కొంది. ఈ హెచ్‌ఎస్‌-200 బూస్టర్‌ను తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో తయారుచేయగా, ఇందులో ఉపయోగించే ఘన ఇంధనాన్ని షార్‌లో తయారుచేశారు. ఈ బూస్టర్‌ పరీక్ష విజయవంతం కావడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఘన ఇంధన బూస్టర్‌ను ఇస్రో రూపొందించుకున్నట్లు అయ్యింది. కాగా గగనయాన్‌ ప్రయోగానికి ఉపయోగించేందుకు జీఎస్‌ఎల్వీమార్క్‌-3 రాకెట్‌ను వ్యోమగాముల కోసం ఎల్‌వీఎం-3గా ఆధునికీకరించారు. మూడు దశల ఈ రాకెట్‌లో తొలిదశ హెచ్‌ఎస్‌-200 బూస్టర్‌ పరీక్ష విజయవంతం కాగా, రెండవ దశ ద్రవ ఇంధన ఎల్‌110-జీ మోటారు, మూడోదశ క్రయో25-జీ మోటారు భూస్థిర పరీక్షలు చివరిదశలో ఉన్నట్లు ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలిదశ బూస్టర్‌ భూస్థిర పరీక్షకు ఇస్రో చైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌, తిరువనంతపురం వీఎస్‌ఎస్‌ఈ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.ఉన్నికృష్ణన్‌, హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ డైరెక్టర్‌ ఆర్‌. ఉమామహేశ్వరన్‌, షార్‌ డైరెక్టర్‌ ఎ. రాజరాజన్‌లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఇస్రో సెంటర్ల ముఖ్య శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

Read more