లింకు పంపి.. మోసం చేసి

ABN , First Publish Date - 2022-05-14T06:57:33+05:30 IST

కరోనా సాయం అందిస్తామని నమ్మించాడు. ఓ లింకు పంపి క్లిక్‌ చేయమన్నాడు. అంతే.. ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో నుంచి మూడు విడతలుగా రూ.30 వేలు లాగేసుకున్నాడు.

లింకు పంపి.. మోసం చేసి

 రామకుప్పం, మే 13: కరోనా సాయం అందిస్తామని నమ్మించాడు. ఓ లింకు పంపి క్లిక్‌ చేయమన్నాడు. అంతే.. ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో నుంచి మూడు విడతలుగా రూ.30 వేలు లాగేసుకున్నాడు. ఇలా సైబర్‌ మోసగాడి చేతిలో రామకుప్పం మండలం గోవిందపల్లెకు చెందిన గోపి మోసపోయారు. బాధితుడి కథనం మేరకు.. గురువారం ఉదయం ఓ వ్యక్తి విజలాపురం పీహెచ్‌సీలోని ఏఎన్‌ఎంకు ఫోన్‌ చేశాడు. తాను కలెక్టరేట్‌ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఆర్థికసాయం అందించడానికి కరోనాతో చనిపోయిన వారి కుటుంబాల వివరాలు ఇవ్వాలన్నాడు. పీహెచ్‌సీ పరిధిలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాల వివరాలు, ఫోన్‌ నెంబర్లను ఆమె అతడికి అందజేశారు. ఆ ప్రకారం పలువురికి ఫోన్‌ చేసి ఆర్థికసాయం గురించి చెప్పాడు. దీనికోసం ఓ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలన్నాడు. ఇలా.. గోవిందపల్లెకు చెందిన గోపికి ఫోన్‌ చేశాడు. బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. ఇతడు చెప్పినట్లు యాప్‌ను గోపి ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. కొంతసేపటికి మళ్లీ సైబర్‌ నేరగాడు ఫోను చేసి ముందు ఇచ్చిన బ్యాంకు అకౌంటులో డబ్బు జమకావడం లేదని మరో అకౌంటు నెంబరు తీసుకున్నాడు. అలాగే తాము పంపిన లింక్‌పై క్లిక్‌ చేయాలని సూచించాడు. అతడు చెప్పినట్లు చేయగానే... గోపి బ్యాంకు ఖాతా నుంచి మూడు విడతలుగా రూ.10 వేల చొప్పున రూ.30వేలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన గోపి రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more