కరోనా సాయం పేరుతో సైబర్‌ నేరగాళ్ల వల

ABN , First Publish Date - 2022-05-14T05:58:46+05:30 IST

కరోనా సాయం అందిస్తామని నమ్మించి సైబర్‌ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.30వేలు కాజేశారు. ఈ సంఘటన రామకుప్పం మండలం గోవిందపల్లెలో చోటు చేసుకుంది.

కరోనా సాయం పేరుతో సైబర్‌ నేరగాళ్ల వల

ఓ యువకుడి నుంచి రూ.30 వేలు స్వాహా 

రామకుప్పం, మే 13: కరోనా సాయం అందిస్తామని నమ్మించి సైబర్‌ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ.30వేలు కాజేశారు. ఈ సంఘటన రామకుప్పం మండలం గోవిందపల్లెలో చోటు చేసుకుంది.  బాధితుడి కథనం మేరకు.. గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి విజలాపురం పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఓ ఏఎన్‌ఎంకు ఫోన్‌ చేశాడు. తాము కలెక్టరేట్‌ నుంచి మాట్లాడుతున్నామని తెలిపాడు. ఆర్థికసాయం అందించడానికి కరోనాతో చనిపోయిన వారి కుటుంబాల వివరాలు తెలపాలని కోరాడు. దీంతో ఆమె పీహెచ్‌సీ పరిధిలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాల వివరాలు, ఫోన్‌ నెంబర్లు తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్లు పలువురికి ఫోన్‌ చేసి ఆర్థికసాయం గురించి ఏఎన్‌ఎం చెప్పిన విధంగానే చెప్పారు. ఆర్థికసాయం కోసం ఓ యాప్‌ ఇన్‌స్టా ల్‌చేసుకోవాలని చెప్పారు. ఇలాగే గోవిందపల్లెకు చెందిన గోపికి ఫోన్‌ చేశారు. అతడు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నాడు. కొంతసేపటికి మళ్లీ సైబర్‌ నేరగాళ్లు కాల్‌ చేసి ముందు ఇచ్చిన బ్యాంకు అకౌంటులో డబ్బు జమకావడం లేదని మరో అకౌంటు నెంబరు తీసుకున్నారు. అలాగే తాము పంపిన లింక్‌పై క్లిక్‌ చేయాలని తెలియజేశారు. గోపి వారి చెప్పినట్లు చేశాడు. వెంటనే మూడు విడతలుగా అతని అకౌంటు నుంచి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.30వేలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన గోపి రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Read more