భృతి ఇవ్వని భరోసా

ABN , First Publish Date - 2022-05-14T08:04:13+05:30 IST

భృతి ఇవ్వని భరోసా

భృతి ఇవ్వని భరోసా

మత్స్యకార భరోసా జాబితాలో కోత 

గతేడాది 1,19,875 కుటుంబాలకు జమ

ఈసారి జాబితాలో 1,08,755 మాత్రమే

11,120 కుటుంబాలకు భృతి ఎగవేత

నిరుడు అర్హులు.. నేడు అనర్హులా?

కోట్లు కుమ్మరించి గొప్పగా ప్రకటనలు

భరోసాపై జగన్‌ సర్కారు పిల్లిమొగ్గలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘చంద్రబాబు హయాంలో కన్నా ఎక్కువ మంది మత్స్యకారులకు వేట నిషేధకాలపు భృతి చెల్లిస్తాం’.. జగన్‌ ఇచ్చిన హామీ ఇది. ఆయన  చెప్పినదాని ప్రకారం ఏటా అర్హుల జాబితా పెరగాలి. అయితే, గతేడాది భృతి పొందిన మత్స్యకారుల్లో ఈ ఏడాది 11,120 కుటుంబాలకు మొండి చేయి చూపారు. గతేడాది 1,19,875 కుటుంబాలకు భృతి ఇవ్వగా.. ఈ ఏడాది ఆ జాబితాను 1,08,755కు కుదించారు. శుక్రవారం కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో జరిగిన ‘మత్స్యకార భరోసా’ సభలో ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేశారు. 1,08,755 కుటుంబాలకు రూ.109 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. గతేడాది కంటే ఈసారి లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత పెట్టింది. ఒక్క ఏడాదిలోనే వేలాది కుటుంబాలు ఎందుకు అనర్హులుగా మారాయో ప్రభుత్వం వెల్లడించలేదు. కానీ ఒక్కసారిగా 11,120 కుటుంబాలు మత్స్యకార భరోసాకు దూరమయ్యాయి. వైసీపీ సర్కార్‌ అమలు చేస్తున్న నవరత్నాల్లో ఏదైనా లబ్ధి పొందుతున్నందుకు భృతి నిలిపివేశారా? లేక వాస్తవంగానే అర్హులు తక్కువగా ఉన్నారా? గత మూడేళ్లుగా పెరిగిన లబ్ధిదారులు ఈ ఏడాది ఎందుకు తగ్గారు? ఈ ప్రశ్నలకు అటు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పడం లేదు. ఏదేమైనా మత్స్యకార భరోసా జాబితాను కుదించినట్లు స్పష్టమవుతోంది. అర్హుల జాబితాలో కోత పెట్టడంతో వృత్తిదారులందరికీ భరోసా ఉండదని తేలిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార వృత్తిలో 15 లక్షల మంది ఉండగా.. కేవలం లక్షా 8 వేల కుటుంబాలకే భృతి ఇవ్వడం ఏంటని వృత్తిదారులు ప్రశ్నిస్తున్నారు. 


పొంతనలేని ‘లెక్కలు’ 

చేపల వేట నిషేధకాలపు భృతిని చంద్రబాబు పాలనలో రూ.4వేలు మాత్రమే ఇచ్చారని.. తాము వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పేరుతో రూ.10 వేలు ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెబుతున్నారు. కోట్లు కుమ్మరించి మరీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ప్రకటనల్లో చెప్పినదానికి, వాస్తవానికి పొంతన లేదు. 2021 మే 18న 1,19,875 మత్స్యకార కుటుంబాలకు భృతిని జమ చేస్తూ క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కారు. అయితే 97,619 మందికి మాత్రమే భృతి చెల్లించినట్లు 2022-23 బడ్జెట్‌ లెక్కల్లో పేర్కొన్నారు. అంటే.. బటన్‌ నొక్కుడుకు, బడ్జెట్‌లో చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉందన్నమాట. గత నెలలో ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దాదాపు 22 వేల మత్స్యకార కుటుంబాలకు మొండి చేయి చూపిన విషయాన్ని వెల్లడించింది. 


మత్స్యకారులందరికీ అందని భరోసా

మత్స్యకారులకు వేట నిషేధకాలపు భృతిని రూ.10 వేలకు పెంచి, లక్షమందికి పైగా ఇస్తామని.. మరబోట్లతో వేట సాగించే మత్స్య కారులతో పాటు సంప్రదాయ పడవలతో చేపలు పట్టే వారికి కూడా  భరోసా ఇస్తామని అధికారం చేపట్టాక జగన్‌ ప్రకటించారు. 2019 నవంబరు 22న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కోనసీమలోని కొమానపల్లిలో మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం ప్రారంభించారు. మత్స్యకార సంఘాల్లో సభ్యులైన జాలర్లందరికీ భరోసా ఇస్తామని అప్పుడు ప్రచారం చేశారు. కానీ ఆ రోజు 1,02,478 మత్స్యకార కుటుంబాలకు రూ.102.48 కోట్ల భృతి జమ చేశారు. ఆ మరుసటి ఏడాది 2020 మే 6న 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్లు జమ చేస్తూ సీఎం బటన్‌ నొక్కారు. 2021 మే 18న 1,19,875 కుటుంబాలకు రూ.119.87 కోట్లు జమ చేశారు. ఈ ఏడాది 1,08,755 కుటుంబాలకు రూ.109 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘నా పాదయాత్రలో మత్స్యకార కుటుంబాల సమస్యలు విన్నాను. అలాంటి కుటుంబాలను ఆదుకునేందుకు ఉన్నాను’ అని మురమళ్ల మత్స్యకార భరోసా సభలో జగన్‌ మరోసారి చె ప్పారు. అయితే వృత్తిదారులందరికీ భృతి ఎందుకు ఇవ్వడం లేదని, జాబితాలో ఎందుకు కోతలు పెట్టారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మత్స్యకార భరోసాపై  సర్కారు పిల్లిమొగ్గలు వేస్తోందని విమర్శిస్తున్నారు. 

Read more