-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Sadly Amma-NGTS-AndhraPradesh
-
మాతాశిశు విభాగంలో నరకం
ABN , First Publish Date - 2022-05-14T05:54:05+05:30 IST
పేదింటి గర్భిణులు ప్రైవేటు, కార్పొరేటు వైద్యం పొందలేరు. తప్పదు కాబట్టి పెద్దాసుపత్రికి వస్తారు. హైరిస్క్ కేసులను ప్రైవేటు, కార్పొరేట్లు చూడవు.
పాపం.. అమ్మ
ఒక మంచంపై ఇద్దరు బాలింతలు
ఒక వెంటిలేటర్‌పై ఇద్దరు శిశువులు
ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటుకు రూ.300 కోట్లు
రెండేళ్లుగా మొదలవ్వని నిర్మాణ పనులు
పేదింటి గర్భిణులు ప్రైవేటు, కార్పొరేటు వైద్యం పొందలేరు. తప్పదు కాబట్టి పెద్దాసుపత్రికి వస్తారు. హైరిస్క్ కేసులను ప్రైవేటు, కార్పొరేట్లు చూడవు. అక్కడ డబ్బులు పిండటం తప్ప.. రిస్క్ తీసుకోవడం ఉండదు. ఉమ్మడి జిల్లాకు అనంతపురం పెద్దాసుపత్రే పెద్ద దిక్కు. అందుకే నిత్యం కిటకిటలాడుతుంటుంది. కానీ పెద్దాసుపత్రి మాతాశిశు విభాగానికి ప్రసవం కోసం వెళ్లడం సాహసమే. ఇక్కడ ఒక మంచాన్ని ఇద్దరికి కేటాయించినా, పడకలు సరిపడవు. ఒక్క వెంటిలేటర్‌పై ఇద్దరు పురిటి బిడ్డలకు చికిత్స చేయాల్సిన దుస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు మాత్రమే పరిష్కారం. దీనికి రూ.300 కోట్లు మంజూరు అయ్యాయి. కానీ రెండేళ్లుగా ఒక్క అడుగూ పడటం లేదు.
అనంతపురం టౌన్ : జిల్లా సర్వజన వైద్యశాలలో మాతాశిశు విభాగం నిత్యం కిటకిటలాడుతుంటుంది. ఒక్కో మంచంపై ఇద్దరు బాలింతలు ఉంటున్నారు. కొందరు నేలపైనే ఉండాల్సిన దుస్థితి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక మాతా శిశు సంరక్షణ విభాగం (ఎంసీహెచ్ బ్లాక్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్బన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు గురించి పదేపదే ప్రకటనలు చేశారు. దీనికోసం రూ.300 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. నాటి కలెక్టర్ గంధం చంద్రుడు, జేసీ సిరితో కలిసి స్థల సేకరణకు తిరిగారు. ఆస్పత్రి ముందుభాగంలో ఉన్న అగ్నిమాపక శాఖ, డీఎంహెచ్ఓ కార్యాలయం, మున్సిపల్ అతిథి గృహం, జల వనరుల శాఖ కార్యాలయం, ఆర్అండ్బీ కార్యాలయం ఉన్న స్థలం ఆస్పత్రికి సంబంధించినదని గుర్తించారు. ఆ కార్యాలయాలను తరలించి, వాటి స్థానంలో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాటి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. కానీ రెండేళ్లుగా ఒక్క అడుగూ కదల్లేదు.
ఆస్పత్రిలో అవస్థలు
జిల్లా సర్వజన ఆస్పత్రి ప్రసూతి కేంద్రంలో గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రసూతి విభాగంలో 90 పడకలు ఉన్నాయి. కాన్పులకు వచ్చేవారి సంఖ్య ఇంతకంటే ఎక్కువుగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 20 మందికి పైగా ప్రసవం కోసం వస్తున్నారు. దీంతో ఆస్పత్రి అధికారులు 180 పడకలను వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసి, సర్దుబాటు చేస్తున్నారు. సిజేరియన్ అయితే వారం పాటు ఉండాల్సి వస్తోంది. తక్కువ మంచాలు ఉండడంతో ఒక్కో మంచంపై ఇద్దరు, రెండు మంచాలపై ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. పురిటి బిడ్డలతో పచ్చి బాలింతలు నరకం చూస్తున్నారు.

ఆగుతున్న ఊపిరి
జిల్లా ఆస్పత్రికి పేదలు, హైరిస్క్ ఉన్న వారే ఎక్కువగా ప్రసవానికి వస్తుంటారు. నెలలు నిండకనే పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉంటారు. ఇన్ఫెక్షన్లతో జన్మిస్తుంటారు. అలాంటి వారిని ఎస్ఎన్సీయూలోని (శిశు సంరక్షణ విభాగం) వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. జిల్లా ఆస్పత్రిలో ఉన్న ఎస్ఎనసీయూలో కేవలం 20 వెంటిలేటర్లు ఉన్నాయి. కానీ 35 నుంచి 40 మంది శిశువులకు వెంటిలేటర్ల సాయం అవసరం అవుతుంది. దీంతో ఒక్కో వెంటిలేటర్‌పై ఇద్దరు శిశువులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ కారణంగా సరైన వైద్యం అందలేక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం నెలకు 300 మంది వరకు శిశువులు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 శాతం మంది చనిపోతున్నారు. ఈ లెక్కన నెలకు 60 మంది శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

అది ఖాళీ.. దీనిపై మౌనం
ఆస్పత్రికి సంబంధించిన స్థలంలో ఏర్పాటైన ఐదు ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కేవలం 8.3 ఎకరాల్లో ఎంసీహెచ్ బ్లాక్, సర్జికల్ బ్లాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జలవనరుల శాఖ, ఆర్అండ్బీ కార్యాలయాలను ఖాళీ చేయించి, ఆ స్థలంలో రెండు బ్లాక్‌లు ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. జలవనరుల శాఖ కార్యాలయాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. పాతూరులోని సీడీ ఆస్పత్రి ఆవరణలో ఉన్న భవనానికి తరలించారు. కానీ ఆర్అండ్బీ కార్యాలయం గురించి ఏడాదిగా నోరుమెదపడం లేదు. ఆ శాఖ కార్యాలయం అక్కడే కొనసాగుతోంది. ఎవరైనా అడిగితే, ‘మీరు పనులు మొదలుపెట్టండి మేము ఖాళీ చేస్తాం’ అని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. పనులు మొదలు కాకపోవడంతో అధికారులు సైతం మౌనంగా ఉండిపోతున్నారు.


ఎంసీహెచ్ బ్లాక్ అత్యవసరం
ఎంసీహెచ బ్లాక్ అనంత ఆస్పత్రికి అత్యవసరం. ఈ బ్లాక్ ఏర్పాటుకు రూ.300 కోట్లు మంజూరయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులతో తల్లుల కోసం 200 పడకలు, శిశువుల కోసం 200 పడకలతో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ మాటలకే పరిమితమయ్యాయి. వెంటనే బ్లాక్ ఏర్పాటు చేస్తే మాతాశిశువుల కష్టాలు తీరుతాయి. వారి ప్రాణాలకు భరోసా ఏర్పడుతుంది. పాలకులు, అధికారులు ఈ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

పూర్తి సమాచారం లేదు...
ప్రత్యేక ఎంసీహెచ్ బ్లాక్, సర్జికల్ బ్లాక్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఏడాది క్రితం జరిగిన సమావేశంలోనూ మాతా శిశు బ్లాక్ 200 పడకలతో ఏర్పాటు చేస్తామన్నారు. జలవనరుల శాఖ, ఆర్అండ్బీ ఆఫీసులు ఖాళీ చేస్తారని, అక్కడ బ్లాక్ ఏర్పాటు చేస్తారని అన్నారు. ఇప్పటికీ పనులు ఎందుకు మొదలు కాలేదో తెలియదు. ఎక్కడెక్కడ ఏ నిర్మాణం చేపట్టారో మాకు సమాచారం లేదు.
- డాక్టర్ నీరజ, వైద్యకళాశాల ప్రిన్సిపాల్
త్వరలో ప్రారంభిస్తాం...
ఎంసీహెచ బ్లాక్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేసింది. నాబార్డ్ అధికారులు సూచించిన మేరకు జలవనరుల శాఖ, ఆర్అండ్బీ కార్యాలయాలు ఖాళీ చేయించి, అక్కడ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్మాణాలపై తీర్మానం చేశారు. త్వరలో పనులను ప్రారంభిస్తాం.
- రాజగోపాల్ రెడ్డి, ఈఈ, ఎపీఎంఎస్ఐడీసీ

