-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Police Zulu-NGTS-AndhraPradesh
-
పోలీసు జులుం!
ABN , First Publish Date - 2022-05-14T06:02:10+05:30 IST
పోలీసుల చర్యలు వివాదాస్పదమవుతున్నాయి.
-విద్యార్థులు, తండ్రులపై విరిగిన లాఠీ
- ధర్మవరంలో శ్రీరామ్ ఫొటో ఫ్లెక్సీలు కట్టుకున్న ఆటోలు
స్టేషనకు తరలింపు
హిందూపురం టౌన, మే 13: పోలీసుల చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. అమాయకులపై అకారణంగా జులుం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. హిందూపురం మండలం రామచంద్రాపురానికి చెందిన విద్యార్థులు, వారి తండ్రులను పోలీసులు కొట్టారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు కట్టుకుని తిరుగుతున్నారని రెండు ఆటోలను స్టేషనకు తరలించడం వివాదాస్పదమైంది.
పోలీసు బెల్టు, లాఠీ మరో మెట్టు ఎక్కాయి. పాఠశాల విద్యార్థులు, వారి తండ్రుల శరీరంపై కర్కశంగా నాట్యం చేశాయి. ఏదో నేరం చేసినందుకు కాదు. సెలవుల్లో పాఠశాల ఆవరణలో సరదాగా క్రికెట్ ఆడినందుకు విద్యార్థులను, అలా స్వేచ్ఛగా వదిలేసినందుకు తల్లిదండ్రులను స్టేషనకు పిలిపించి, ట్రీట్మెంట్ ఇచ్చారు. తండ్రుల ఎదుట బిడ్డలను, బిడ్డల ఎదుట తండ్రులను పోలీస్ బెల్టు, లాఠీలతో కొట్టారు. మండలంలోని రామచంద్రాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత తల్లిదండ్రులు హిందూపురం ప్రెస్‌క్లబ్‌కు శుక్రవారం వచ్చి విలేకరులకు జరిగిన ఘటన గురించి తెలియజేశారు.
ఏం జరిగింది..?
రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలకు ఈ నెల 5వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు. ఈనెల 10వ తేదీన విద్యార్థులు పాఠశాల ఆవరణలో సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. అదే సమయంలో హెచఎం గంగిరెడ్డి పాఠశాల వద్దకు వెళ్లారు. అక్కడున్న విద్యార్థులను మందలించారు. పాఠశాలలోని వాటర్ ట్యాంక్, పైపులు, తలుపులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ, అక్కడ ఆడుకుంటున్న విద్యార్థుల ఫొటోలు తీశారు. వాటిని హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన పోలీసులకు పంపారు. పోలీసులు ఆగమేఘాల మీద గ్రామానికి వెళ్లారు. ఆడుకుంటున్న విద్యార్థులు మంజునాథ్, కల్యాణ్‌రామ్, సందీప్, నవీన, ప్రవీణ్, ఉప్పర ప్రవీణ్‌ను ఫొటో ఆధారంగా గుర్తించారు. అదేరోజు సాయంత్రం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అప్‌గ్రేడ్ పోలీ్‌సస్టేషనకు రప్పించారు. రాత్రి 10 గంటల వరకు స్టేషనలో పెట్టుకుని పంపించేశారు. మరుసటిరోజు కూడా వారిని రమ్మన్నారు. దీంతో బుధవారం ఉదయం చిన్నారులతో కలిసి వారి తండ్రులు స్టేషనకు వెళ్లారు. రాత్రి వరకు స్టేషనలోనే ఉన్నారు. రాత్రి ఏడెనిమిది గంటల సమయంలో విద్యార్థులను తీవ్రంగా మందలించారు. వారి తండ్రుల ముందే బెల్ట్‌తో కొట్టారు. పిల్లలను ఎందుకు కొడతారని ఒకరిద్దరు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు కానిస్టేబుళ్లు, సీఐ జీటీ నాయుడు ఫైబర్ లాఠీలకు పనిచెప్పారు. నేరస్థులను కొట్టినట్లు చిన్నారుల ఎదుటే వారి తండ్రులు రామాంజి, అంజినప్ప, నాగప్ప, సజ్జప్ప, సిద్దలింగప్పను చితకబాదారు. రామాంజినప్ప, అంజినప్పకు మూడు రోజులైనా చేతుల వాపులు తగ్గలేదు. కరోనా సమయంలో మందుబాబులు.. పాఠశాలలో సామగ్రిని ధ్వంసం చేశారని విద్యార్థులు, వారి తండ్రులు వాపోయారు. చేయని తప్పుకు పోలీసులు తమకు ఇలాంటి శిక్ష వేయడం, తమ ముందే బిడ్డలను కొట్టడం తీవ్రంగా బాధించిందని వారు ఆవేదన చెందారు. అకారణంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై విద్యార్థి, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై హెచఎం గంగిరెడ్డిని వివరణ కోరగా, తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదనీ, మందలించాలని మాత్రమే చెప్పానన్నారు. అప్‌గ్రేడ్ సీఐ జీటీ నాయుడును వివరణ కోరగా.. పాఠశాల హెచఎం ఫిర్యాదు చేశారనీ, మందలించాలని చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించి పంపించామని, కొట్టలేదని అన్నారు. పాఠశాల హెచఎం గంగిరెడ్డి.. ఓ ప్రజాప్రతినిధి బంధువు అయినందుకే పోలీసులు అతిగా స్పందించారన్న ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల సందర్శనకు శుక్రవారం వెళ్లిన హెచఎంను తల్లిదండ్రులు నిలదీశారు.
సీఐ, ఎస్ఐను సస్పెండ్ చేయాలి : విద్యార్థి సంఘాలు
రామచంద్రాపురం పాఠశాలలో సామగ్రి ధ్వంసం అయ్యాయని ఫిర్యాదు చేసిన హెచఎం గంగిరెడ్డి, స్టేషనకు పిలిపించి విద్యార్థులను కొట్టిన అప్‌గ్రేడ్ సీఐ జీటీ నాయుడు, పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు సంపతకుమార్, బాబావలి, అభిషేక్, చంద్ర, సందీప్.. రామచంద్రాపురానికి చేరుకుని, ఘటనపై ఆరాతీశారు. వారు మాట్లాడుతూ 5, 6 తరగతులు చదివే విద్యార్థులు క్రికెట్ ఆడుతుంటే ఆ బాల్ తగిలి వాటర్ ట్యాంకు, పైపులు ధ్వంసమయ్యాయని హెచఎం చెప్పడం విడ్డూరమన్నారు. దీనికి వెంటనే స్పందించిన జీటీ నాయుడు, పోలీసులు.. విద్యార్థులు, వారి తండ్రులను పిలిపించి స్టేషనలో నేరస్థులను కొట్టినట్లు కొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, లేదంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడంతోపాటు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ధర్మవరంలో పోలీసుల కొత్త రూల్
ధర్మవరం: ధర్మవరం పోలీసులు కొత్త రూల్ అమలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటోలపై డ్రైవర్లు తమకు నచ్చిన స్టిక్కర్లు వేసుకోవడం నేరంగా కనిపించినట్లుందని బాధితులు వాపోతున్నారు. ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ ఆటోలపై టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ ఫొటోలతో కూడిన స్టిక్కర్లు అతికించారన్న కారణంతో ఆ ఆటోలను ఏకంగా స్టేషనకు తరలించి, పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇదేమని గట్టిగా అడగడంతో ఏవేవో సాకులు చూపడం పోలీసులకు తగునా అని ఆటోవాలాలు ప్రశ్నిస్తున్నారు. శనివారం చెన్నకేశవస్వామి రథోత్సవం సందర్భంగా పరిటాల శ్రీరామ్ స్టిక్కర్లను ఆటోలకు అతికించుకుని తిప్పుతున్నారు. దీంతో పోలీసులు గురువారం సాయంత్రం రెండు ఆటోలను స్టేషనకు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు స్టేషన వద్దకు చేరుకుని, ఆటోలను వదిలిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు పోలీసులు తుచ తప్పకుండా అమలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ధర్మవరంలో పోలీసులు ఐపీసీ సెక్షన్లకు బదులుగా వైసీపీ సెక్షన్లు అమలు చేస్తున్నారనీ, గతంలో కూడా టీడీపీ శ్రేణులపై అత్యుత్సాహం చూపారన్నారు. చివరికి పోలీసులు.. ఆటోలకు సక్రమంగా పత్రాలు లేవంటూ సాకులు చెబుతూ రూ.2500 జరిమానా చెల్లించాలని చెప్పడంతో టీడీపీ సానుభూతి ఆటోడ్రైవర్లు అంత కట్టలేమని చెప్పారు. చివరికి రూ.500 మాత్రమే కట్టించుకున్నారు. ఆటోలు నడుపుకుంటే తప్ప జీవనం సాగించలేమనీ, అలాంటి తమపై పోలీసులు ప్రతాపం చూపితే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అర్బన సీఐ కరుణాకర్‌ను వివరణ కోరగా.. స్టిక్కర్లతో సంబంధమే లేదనీ, లైసెన్స, రికార్డులు సక్రమంగా లేని ఆటోలను స్టేషనకు తరలించి, జరిమానాలు వేసి పంపించామని చెప్పుకొచ్చారు. ఒక ఆటోకు రికార్డులు లేవనీ, మరోదాని డ్రైవర్‌కు లైసెన్సలేదని సీఐ తెలిపారు.

