-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Did not agree to a second marriage killed his wife-NGTS-AndhraPradesh
-
రెండో పెళ్లికి ఒప్పుకోలేదని.. భార్యను చంపేశాడు
ABN , First Publish Date - 2022-05-14T05:58:35+05:30 IST
రెండో పెళ్లికి ఒప్పుకోనందుకు ఓ వ్యక్తి భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రామగిరిలో శుక్రవారం చోటు చేసుకుంది
రామగిరి, మే 13: రెండో పెళ్లికి ఒప్పుకోనందుకు ఓ వ్యక్తి భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రామగిరిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు, రామగిరికి చెందిన అల్లం శంకరకు కర్ణాటక రాష్ట్రం ఇంటూరాయనిపల్లికి చెందిన బండారు వెంకటాద్రి, లక్ష్మీదేవి దంపతుల పెద్ద కూతురు శోభారాణి(35)తో 19 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పుట్టిన బిడ్డ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తరువాత సంతానం కలగలేదు. ఈ కారణంగా భార్యను శంకర తరచూ వేధించేవాడు. రెండో పెళ్లి చేసుకుంటానని, తనకు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో జీవనాధారం చూపించి, విడాకులు ఇవ్వాలని శోభారాణి, ఆమె పుట్టింటివారు డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించని శంకర, భార్యను గతంలో విచక్షణారహితంగా బాదాడు. ఈ గొడవ పోలీస్ స్టేషన వరకూ వెళ్లింది. ఇకపై తన భార్యను బాగా చూసుకుంటానని పోలీసులు, పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకుని, భార్యను ఇంటికి తీసుకుపోయాడు. ఈ గొడవ తరువాత శోభారాణి తల్లిదండ్రులను, బంధువులను తన ఇంటికి రానిచ్చేవాడు కాదు. వేధింపుల్లో భాగంగా భార్యను కూలి పనులకు పంపేవాడు. తను వ్యవసాయం చేసేవాడు. ఇటీవల భార్యను వేధించడం, ఆమెతో గొడవపడటం ఎక్కువైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న భార్యను రోకలిబండతో విచక్షణారహితంగా బాది హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రామగిరి ఎస్ఐ జనార్దన నాయుడు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి ఆనవాళ్లు సేకరించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శంకర భార్యను హత్య చేసిన అనంతరం నేరుగా రామగిరి పోలీస్ స్టేషనకు వెళ్లి లొంగిపోయాడు.
బాలిక ఆత్మహత్య
కళ్యాణదుర్గం, మే 13: మండలంలోని దురదకుంట గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలిక శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు, బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదివి, ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు గత నెల 6వ తేదీన బాలికను కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రులు అదే రోజు రూరల్ పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు. 8వ తేదీన బాలికను, ఆమెతో ఉన్న ఓ యువకుడిని పోలీసులు రాయదుర్గంలో పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురిపై కేసు నమోదు చేశారు. కానీ ఒక యువకుడిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మిగిలిన ముగ్గురు అటూ ఇటూ తిరుగుతూ వేధించే వారు. దీంతో బాలిక తీవ్ర ఆవేదనకు లోనైంది. తల్లి పెళ్లికి, తండ్రి బయటకు వెళ్లిన సమయంలో, శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుంది. తండ్రి ఇంటికి వచ్చి చూసేలోగా బాలిక ప్రాణం పోయింది. తన కూతురును వేధిస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలిక తండ్రి బోరున విలపించాడు. బాలిక ఆత్మహత్యపై ఆమె తండ్రి రూరల్ ఎస్ఐ సుధాకర్‌కు ఫిర్యాదు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

