సాగు చేయలేం..!

ABN , First Publish Date - 2022-05-14T05:53:10+05:30 IST

వసాయమే పరమావధిగా భావిస్తున్న రైతన్నలకు డీజిల్‌ ధరల పెంపు గుదిబండగా మారింది.

సాగు చేయలేం..!

-సేద్యంపై డీజిల్‌ ధరల ప్రభావం

-పెరగనున్న ట్రాక్టర్‌ బాడుగలు

-సాగుపై సన్నగిల్లుతున్న ఆశలు 

-సందిగ్ధంలో రైతులు

-ఖరీ్‌ఫ విస్తీర్ణం తగ్గే ప్రమాదం


 ధర్మవరం  వసాయమే పరమావధిగా భావిస్తున్న రైతన్నలకు డీజిల్‌ ధరల పెంపు గుదిబండగా మారింది. వ్యవసాయ పనుల నిమిత్తం రైతన్నలు ఎద్దులను ఉపయోగించేవారు. కాలక్రమేణా ఎద్దులు తగ్గిపోవడంతో వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు ట్రాక్టర్లపై ఆధారపడుతున్నారు. దుక్కి నుంచి పంటల నూర్పిడి వరకు అన్నింటికీ యంత్రాలే దిక్కు. ఈ నేపథ్యంలో రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్‌ ధరలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రాక్టర్‌ బాడుగలను యజమానులు పెంచేస్తున్నారు. ఈ బాడుగలతో వ్యవసాయం చేయాలంటే రైతన్నలు బెంబేలెత్తుతున్నారు. సాగుపై ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నట్లు పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.


గతేడాది పంట నష్టం కూడా..

గతేడాది ఖరీ్‌ఫలో వర్షాధారం కింద సాగుచేసిన పంటలు అన్నదాతకు తీవ్ర నష్టం మిగిల్చాయి. వేరుశనగ పంట తొలగించి, చేనులో ఉండగానే అధికవర్షాలతో తడిసి ముద్దయి, పంటదిగుబడితోపాటు పశుగ్రాసం కూడా దక్కలేదు. వరిపంట కూడా అధికవర్షాలు, ఈదురుగాలులకు నేలకొరిగి, చేతికి అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఏడాది సాగు చేద్దామంటే డీజిల్‌ ధరలతో పెట్టుబడులు పెరుగుతాయనీ, పంట చేతికొచ్చే వరకు ఆందోళనగా ఉంటుందనీ, పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటంతా నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందక అప్పులే మిగిలాయని పలువురు పేర్కొంటున్నారు.

ఆసక్తి చూపని అన్నదాత

ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో గత ఖరీఫ్‌ సీజనలో బోరుబావుల కింద వేరుశనగతోపాటు కాయగూరల పంటలు సుమారు 10 వేలహెక్టార్లలో సాగయ్యాయి. మెట్టభూముల్లో వేరుశనగపంటతో కంది, అంతర పంటలు దాదాపు 40 వేల హెక్టార్లల్లో సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజురోజుకీ డీజిల్‌ ధరలు పెరుగుతుండడంతో వ్యవసాయ పెట్టుబడులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది రైతులు సాగుపట్ల ఆసక్తి చూపట్లేదు.


పెరిగిన డీజిల్‌ ధరలతో ఇక్కట్లు


ప్రస్తుతం డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో సేద్యపు పనుల కోసం ట్రాక్టర్‌ యజమానులు బాడుగలు పెంచుతున్నారు. గతేడాది రూ.90 మధ్య డీజిల్‌ ధరలు ఉన్నపుడే వరిమడిలో పనులకు గంటకు రూ.1000 నుంచి రూ.1100 వరకు బాడుగ తీసుకునేవారు. ఖరీఫ్‌ వేరుశనగ సాగు, సేద్యపు పనుల కోసం ఎకరాకు రూ.900 నుంచి రూ.1000 వరకు బాడుగ తీసుకునేవారు. ప్రస్తుతం డీజిల్‌ ధరలు రూ.107.19 ఉండటంతో ఈ ఏడాది రూ.1200 నుంచి రూ.1400 వరకు బాడుగ పెంచేందుకు ట్రాక్టర్‌ యజమానులు సిద్ధమవుతున్నారు. డీజిల్‌ ధరల పెంపుతో రూ.వేలకు వేలు దుక్కి దున్నుకోవడానికే వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

వాహనదారులపై  పెనుభారం

డీజిల్‌ ధరల పెంపు ప్రభావం తమపై కూడా పడుతోందని పలువురు ట్రాక్టర్‌ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాడుగలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఈ రైతులు సాగుపట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో రూ.లక్షలు వెచ్చించి తెచ్చుకున్న ట్రాక్టర్లను ఇళ్ల వద్దే ఉంచుకోవాల్సి వస్తోందని వారు గగ్గోలు పెడుతున్నారు. 


ఆసక్తి లేదు: ఆదినారాయణ, రైతు, బడన్నపల్లి

పెట్టుబడుల భారంతో పంటల సాగు పట్ల ఆసక్తి లేదు. సేద్యపు పనులకే రూ.వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో సాగుపై ఆసక్తిలేదు. గత ఏడాది పంటలు సాగుచేసి తీవ్రంగా నష్టపోయా. వేరుశనగ, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. 


సాగు చేయాలంటే భయంగా ఉంది: పుల్లారెడ్డి, చిగిచెర్ల

ప్రస్తుతం వర్షం వస్తే ముంగారు సేద్యపు పనులు చేయాల్సి ఉంటుంది. డీజిల్‌ ధరలు పెరిగాయని ట్రాక్టర్‌ బాడుగలు పెంచుతున్నారు. దీంతో సాగు చేయాలంటే భయంగా ఉంది. రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టినా.. పంట చేతికొస్తుందన్న నమ్మకం లేదు. గతేడాది వేరుశనగ సాగుచేసి వర్షానికి తడిసిపోయి పూర్తి నష్టం వచ్చింది. ఆ అప్పులే ఇంకా తీరలేదు.




Read more