95 శాతం హామీలు అమలు
ABN, First Publish Date - 2022-05-14T08:17:14+05:30
95 శాతం హామీలు అమలు
సంక్షేమ పథకాల ద్వారా పేదలకు 1.40 లక్షల కోట్ల నగదు బదిలీ
దేశ చరిత్రలో మా ప్రభుత్వానిదే ఈ ఘనత
1,08,057 మత్స్యకార కుటుంబాలకు భృతిగా రూ.109 కోట్లు జమ: జగన్
అమలాపురం, మే 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చాక 35 నెలల్లో 32 సంక్షేమ పథకాల ద్వారా పేదలకు రూ.లక్షా 40 వేల కోట్ల నగదును బదిలీ చేశామని సీఎం జగన్ వెల్లడించారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా పేద ప్రజలకు ఇంత లబ్ధి చేకూర్చిన ఘనత దేశ చరిత్రలో తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నా రు. శుక్రవారం కోనసీమ జిల్లా ఐ.పోలవరం మం డలం మురమళ్లలో జరిగిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగో విడతలో భాగంగా 1,08,057 మత్స్యకారుల కుటుంబాలకు రూ.109 కోట్లను భృతిగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటివరకు 4 విడతల్లో మత్స్యకారులకు రూ.419 కోట్లు ఇచ్చామన్నా రు. 50 నిమిషాల పాటు ఆయన సుదీర్ఘ ప్రసం గం చేశారు. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ కార్యకలాపాల వల్ల కాకినాడ, కోనసీమల పరిధిలోని 69 గ్రామాల్లో 6178 బోట్లకు సంబంధించి 23,458 కుటుంబాలకు నెలకు రూ.11,500 చొప్పున 4 నెలలకు రూ.46 వేలు అందిస్తున్నామన్నారు. మత్స్యకార భరోసా కింద రూ.109 కోట్లు, ఓఎన్జీసీ పరిహారం కింద రూ.108 కోట్లు.. మొత్తం రూ.217 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ‘‘వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేస్తున్నాం. మత్స్యకార భృతిని రూ.10 వేలకు పెంచాం. డీజిల్ పై సబ్సిడీని 50 శాతం పెంచి లీటరుకు రూ.9 చేశాం. సబ్సిడీ ఆయిల్ తీసుకునే సమయంలోనే లబ్ధిపొందేలా స్మార్ట్‌కార్డు విధానం అమలు చేశాం. మూడేళ్లలో ఆయిల్ సబ్సిడీ కింద రూ.17,770 కో ట్లు ఇచ్చాం. 180 ఏళ్ల క్రితం మల్లాడి సత్యలింగం నాయకర్ సముద్రాన్నే నమ్ముకుని రంగూన్ వెళ్లి అపర కుబేరుడిగా మారారు. ఆ సమయంలో ఈ జిల్లాలో భూములు కొనుగోలు చేసి, ట్రస్టు పెట్టి వేలమంది పేదలకు ఎన్నో దానధర్మాలు చేశారు. అటువంటి మహనీయులను యువత ఆదర్శంగా తీసుకోవాలి’’ అని జగన్ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణతో పాటు ఈ పనులన్నింటికీ రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం, ఉప్పాడ వంటిచోట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ‘ప్రతి మత్స్యకారుడికి మంచి జరగాలి. ఆక్వా ఉత్పత్తులకు మంచి రే టు రావాలనే దానిపై ఆలోచించాను. దేశీయంగా మత్స్య వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా రూ.330 కోట్లతో 70 ఆక్వా హబ్‌లు, వాటికి అనుసంధానంగా 14 వేల రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. వీటివల్ల రాష్ట్రవ్యాప్తంగా 80 వేలమంది మత్స్యకారులకు ఉపాధి కలుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఓసీల్లోని నిరుపేదలు.. ఇలా ఏ సామాజికవర్గానికి చూసుకున్నా అందరికీ లబ్ధి చేకూర్చాం’’ అని జగన్ వెల్లడించారు. ఎప్పటిలాగే ఈ సభలో కూడా జగన్ తనకు గిట్టని మీడియాను, ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు.