యాదాద్రి జిల్లాలో నేడే పోలింగ్‌

ABN , First Publish Date - 2021-03-14T05:33:28+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

యాదాద్రి జిల్లాలో నేడే పోలింగ్‌
భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని అందజేసిన అధికారులు

ఎన్నికలకు సర్వంసిద్ధం

జిల్లాలో 54 పోలింగ్‌ కేంద్రాలు.. 38,367 మంది ఓటర్లు

భువనగిరి టౌన్‌/ భువనగిరి రూరల్‌, మార్చి 13: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14 వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకోసం 18 కేంద్రాల్లో 54 పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 38,367 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 25,041మంది పురుషులు, 13,221 మంది మహిళలు, ఐదుగురు ఇతరులు ఉన్నారు. పోలింగ్‌ విధుల్లో 350 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వీరిలో 73 మంది పీవోలు, 83 మంది ఏపీవోలు, 157 మంది ఓపీఎ్‌సలు, 25 మంది మైక్రోఅబ్జర్వర్లు, నాలుగు సెక్టోరియల్‌ టీమ్స్‌తోపాటు 29 మంది వెబ్‌ కాస్టింగ్‌ బృందం ఉన్నారు.  


జంబో బ్యాలెట్‌ కోసం భారీ టేబుళ్లు 

71 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఎన్నికల కమిషన్‌ భారీ బ్యాలెట్‌ను ముద్రించింది. అయితే భారీ బ్యాలెట్‌ను ఓటరు చూసుకునేలా పోలింగ్‌ కేంద్రాల్లో అందుకు అనువైన పెద్ద టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓటరు బ్యాలెట్‌ పేపర్‌ను టేబుల్‌పై ఉంచి పరిశీలించి ఓటు వేసుకునేలా ఏర్పాట్లుచేశారు. ఐదు నిమిషాలలోపు ఓటు వేయాల్సి ఉంటుంది. నిర్ధేశిత సమయం దాటితే ప్రిసైడింగ్‌ అధికారి ఓటరును అప్రమత్తం చేస్తారు. ఎన్నికల సిబ్బంది ఇచ్చే పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. 


జిల్లాలో అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలో అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఆలేరు-4, మోటకొండూరు-2 కేంద్రాలు అతి సమస్యాత్మకమైనవి కాగా, సమస్యాత్మకమైనవిగా అడ్డగూడూరు-2, ఆత్మకూరు-2, చౌటుప్పల్‌ -6, మోత్కూరు-2, నారాయణపూర్‌-2, పోచంపల్లి-3, రామన్నపేట-3, తుర్కపల్లి- 2వలిగొండ-6, సాధారణమైన పోలింగ్‌ కేంద్రాలు భువనగిరి-9, బీబీనగర్‌-3, గుండాల-2, రాజాపేట-2, యాదగిరిగుట్ట-3, బొమ్మలరామారం-1 కేంద్రాలను గుర్తించారు. 


పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఈ నెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలోని డివిజన్‌ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ సందర్శించి, సామగ్రిని పరిశీలించారు. కలెక్టర్‌ వెంట అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, జీడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్‌, ఏసీసీ సత్తయ్యలు ఉన్నారు. చౌటుప్పల్‌ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలింగ్‌ సెంటర్లలో గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ సత్తయ్య తెలిపారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. 


గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తప్పని సరి

ఈ నెల 14న ఓటేసేందుకు ఓటర్‌ గుర్తింపు కార్డు  లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన తొమ్మిది డాక్యుమెంట్లలో ఏదైనా ఒక కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డ్‌, పాస్‌పోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌ సెక్టార్‌, లోకల్‌ బాడీస్‌, ప్రైవేట్‌ ఇండస్ట్రియల్‌ హౌస్‌ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, విద్యాసంస్థల ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీల ద్వారా జారీ చేసిన డిగ్రీ, డిప్లొమా ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, దివ్యాంగ ధ్రువపత్రాల్లో ఏదేని ఒకటి ఒరిజినల్‌ వెంట ఉండాలి.


 ఎవరి దీమా వారిదే

నల్లగొండ, మార్చి13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బరిలో 71 మంది అభ్యర్థులు, 5.05లక్షల మంది ఓటర్లు. 12 జిల్లాల్లో నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉండడంతో గెలుపుపై ఎవరి అంచనాలో వారున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, టీజేఎస్‌ నుంచి కోదండరాం, బీజేపీ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములునాయక్‌, సీపీఐ నుంచి జయసారథిరెడ్డి, యువతెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరుకు సుధాకర్‌గౌడ్‌, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ ఈ ఎనిమిది మంది ఎమ్మెల్సీ పోరులో నిలిచి గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. అధికార పార్టీ, బలమైన క్యాడర్‌, ప్రత్యర్థుల మధ్య ఓట్ల చీలిక, కొద్ది రోజుల ముందు పీఆర్‌సీపై సీఎం కేసీఆర్‌ స్పష్టతపైనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు.  ఉస్మానియా ప్రొఫెసర్‌గా ఉపాధ్యాయులు, పట్టభద్రులతో విస్తృత సంబంధాలు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తాయని కోదండరాం అంచనా వేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, యువత తమవైపు ఉండటం, బలమైన క్యాడర్‌ను బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి బలంగా భావిస్తున్నారు. ఎస్టీ సామాజికవర్గం ఓట్లు ఈ నియోజకవర్గంలో భారీగా ఉండటం, అవి గంపగుత్తగా తన ఖాతాలోనే పడతాయని బలమైన కాంగ్రెస్‌ పార్టీ గట్టెక్కిస్తాయని రాములునాయక్‌ ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సీపీఎం, సీపీఐ బలంగా ఉండటం వాటికి అనుబంధంగా ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉపకరిస్తాయని జయ సారథిరెడ్డి నమ్ముతున్నారు. బీసీ, ఎస్సీ సంఘాలు మద్దతు ప్రకటించడం, తెలంగాణ ఉద్యమ కాలంలో పీడీ కేసులో అరెస్టయి సుదీర్ఘకాలం జైలులో ఉన్న మొదటి వ్యక్తిగా, వృత్తి రీత్యా డాక్టర్‌ నేపఽథ్యం తనను గెలిపిస్తాయని చెరుకు సుధాకర్‌ అంచనా వేసుకుంటున్నారు. తమతోనే మార్పు సాధ్యం, యువ మహిళ, రెడ్డి సామాజికవర్గం, జర్నలిస్టు, కొత్త రాజకీయ పార్టీగా తమకు ఆదరణ లభిస్తోందని యువతెలంగాణ అభ్యర్థి రాణి రుద్రమ అంటున్నారు. కేసీఆర్‌తోపాటు ఆయన కు టుంబం, టీఆర్‌ఎస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న మాటల తూటాలు పే ల్చుతూ తమదైన శైలిలో ప్రచారం నిర్వహించారు.  

Read more