టైగర్‌ జోన్‌ గ్రామాల తరలింపు ఎప్పుడు

ABN , First Publish Date - 2021-02-10T03:36:19+05:30 IST

కవ్వాల్‌ అభయారణ్యంలోని టైగర్‌ జోన్‌ పరిధిలో గల గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించేం దుకు మోక్షం లభించడం లేదు. ఏప్రిల్‌ 2012లో కవ్వాల్‌ అభయారణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అడవుల్లో ఉన్న గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలిస్తే పులుల సంరక్షణ చేపట్టవచ్చని భావించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది.

టైగర్‌ జోన్‌ గ్రామాల తరలింపు ఎప్పుడు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మైదాన ప్రాంతానికి తరలించాల్సిన దొంగపల్లి గ్రామం

జిల్లాలో మూడు గ్రామాలు ఎంపిక

తొమ్మిదేళ్లు గడిచినా పునరావాసానికి నోచుకోని ప్రజలు

అడవుల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు

మైదాన ప్రాంతాలకు తరలివెళ్లేందుకు గిరిజనుల సుముఖం

మంచిర్యాల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కవ్వాల్‌ అభయారణ్యంలోని టైగర్‌ జోన్‌ పరిధిలో గల గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించేం దుకు మోక్షం లభించడం లేదు. ఏప్రిల్‌ 2012లో కవ్వాల్‌ అభయారణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అడవుల్లో ఉన్న గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలిస్తే పులుల సంరక్షణ చేపట్టవచ్చని భావించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాలోని జన్నారం అటవీ ప్రాంతం (కోర్‌ ఏరియా)లోని మల్యాల, అల్లీనగర్‌, దొంగపల్లి గ్రామాలతోపాటు నిర్మల్‌ జిల్లా కడెం మండల పరిధిలోని రాంపూర్‌, మైసంపేటను మైదాన ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. 

పులుల ఆవాసానికి చర్యలు

మహారాష్ట్రలోని తాడోబా, ఇంద్రావతి టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లలో పులుల సంఖ్య పెరుగుతుండటంతో సరిహద్దు జిల్లా అయిన ఉమ్మడి ఆదిలా బాద్‌లోకి పులులు వచ్చే అవకాశాలు  ఉన్నాయని కవ్వాల్‌ అటవీ ప్రాంతా న్ని టైగర్‌జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. పులి వస్తే నిలిచేందుకు సరిపడ ఆహారం ఉండాలన్న ఆలోచనతో శాకాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గడ్డి క్షేత్రాలు ఏర్పాటుచేశారు. అలజడి ఉంటే పులి ఆగదని భావించిన యం త్రాంగం అడవుల్లో ఉన్న గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించేం దుకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా  కుటుంబాల సర్వే నిర్వహించారు. అప్పట్లో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్యాకేజీ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ సమయంలో కొన్ని గ్రామాల గిరిజనులు అడవిని వదిలి వెళ్లేందుకు నిరాకరించడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.

సమస్యలతో సహవాసం

కవ్వాల టైగర్‌ జోన్‌లోని నిర్మల్‌ జిల్లా మైసంపేట, రాంపూర్‌ గ్రామాల తరలింపునకు ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా మంచిర్యాల జిల్లాలో 9 సంవత్సరాలు గడుస్తున్నా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో జిల్లాలోని ఆయా గ్రామాల ప్రజలు సమస్యలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్మల్‌ జిల్లాలోని రెండు గ్రామాల ప్రజల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం మార్చిలో రూ.9 కోట్లు విడుదల చేయగా, తాజాగా ఈనెల 16న రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.7.68 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఆ రెండు గ్రామాల తరలింపునకు మార్గం సుగమమైంది. కడెం మండలంలోని పెత్తరుపులో పునరావాసం కల్పించేందుకు చర్యలు మొదలయ్యాయి. అయితే జిల్లాలోని కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలోగల జన్నారం మండలం కోర్‌ ఏరియా (అటవీ ప్రాంతం)లో గల మల్యాల, అల్లీనగర్‌, దొంగపెల్లి గ్రామాల తరలింపునకు మోక్షం ఎప్పుడు జరుగుతుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కలెక్టర్‌ చైర్మన్‌గా ఉన్న పునరావాస కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులతో సర్వేలు చేసి ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కార్యరూపం దాల్చకపోవ డంతో మూడు గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం, విద్య, వైద్య సేవలు అందక అడవుల్లో మగ్గుతున్నారు. 

అనువైన చోట పునరావాసం కల్పించాలి

ఆత్రం హన్మంతరావు, మల్యాల సర్పంచ్‌ 

మల్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని మల్యాల, అల్లీనగర్‌, దొంగపల్లి గ్రామాల ప్రజలకు మండలంలోని అనువైన చోట పునరావాసం కల్పిం చాలి. అలాగే ప్రజలకు ఉపాధి కల్పన, నివాస గృహాల నిర్మాణం, పాఠ శాల, ఆరోగ్య కేంద్రం, తదితర మౌలిక వసతులు కల్పిస్తే అడవి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.

గ్రామాలను తరలించే అవకాశం ఉంది

మాధవరావు, జన్నారం ఎఫ్‌డీఓ 

నిర్మల్‌ జిల్లాలో గ్రామాల తరలింపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నాం. మూడు గ్రామాలను తరలిస్తే అడవిలో పులి స్వేచ్ఛగా జీవించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. గడ్డి క్షేత్రాలు, శాకాహార జంతువులు కూడా ఉండటంతో ఇక్కడకు వచ్చే పులి తిరిగి వెళ్లకుండా స్థిరంగా ఉండే వీలు ఉంటుంది. 

Read more