సంచలనం.. బుర్ఖాలపై నిషేధం.. ఇస్లామిక్ పాఠశాలల మూసివేత..!

ABN , First Publish Date - 2021-03-14T01:19:56+05:30 IST

: బుర్ఖా ధరించడాన్ని శ్రీలంక ప్రభుత్వం త్వరలో నిషేధిస్తుందని ఆ దేశ అంతర్గత భద్రతా శాఖ మంత్రి శరత్ వీరశేఖర్ శుక్రవారం నాడు ప్రకటించారు.

సంచలనం.. బుర్ఖాలపై నిషేధం.. ఇస్లామిక్ పాఠశాలల మూసివేత..!

కొలంబో: బుర్ఖా ధరించడాన్ని శ్రీలంక ప్రభుత్వం త్వరలో నిషేధిస్తుందని ఆ దేశ అంతర్గత భద్రతా శాఖ మంత్రి శరత్ వీరశేఖర్ శుక్రవారం నాడు ప్రకటించారు. అంతేకాకుండా.. దేశంలోని వెయ్యికి పైగా ఇస్లామిక్ పాఠశాలలను కూడా మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. దేశభద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ముసాయిదా ఆదేశాలను మంత్రుల కేబినేట్‌ పరిశీలనకు కూడా పంపించినట్టు వీరశేఖర తెలిపారు. ‘ఒకప్పుడు ముస్లిం మహిళలు ఎవరూ బుర్ఖాలు ధరించేవారు కాదు. ఇటీవలకాలంలో తలెత్తిన అతివాదానికి బుర్ఖా ఓ సంకేతం. దీన్ని కచ్చితంగా నిషేధిస్తాం అని ఆయన పేర్కొన్నారు. 


2019లో శ్రీలంక చర్చీల్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడి అనంతరం..అక్కడి ప్రభుత్వం బుర్ఖా ధరించడాన్ని తాత్కాలికంగా నిషేధించింది. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో రాజపక్స గెలిచి మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించారు. శ్రీలంకలో తిరుగుబాటును ఉక్కుపాదంతో అణిచివేసిన వ్యక్తిగా పేరొందిన  రాజపక్స అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మరోసారి బుర్ఖా అంశం తెరపైకి వచ్చింది. కాగా..  జాతీయ విద్యా విధానాన్ని ఉల్లంఘిస్తున్న ఇస్లామిక్ పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు మంత్రి వీరశేఖర పేర్కొన్నారు. ‘పాఠశాలలను ప్రారంభాంచి పిల్లలకు ఇష్టమొచ్చిన పాఠ్యాంశాలను బోధిస్తామంటూ కుదరదు అంటూ మంత్రి విస్పష్ట ప్రకటన చేశారు. 


అయితే..గతేడాది కూడా శ్రీలంక ప్రభుత్వం ఇటువంటి వివాదాస్పద నిర్ణయమే తీసుకుంది. కరోనా సంక్షోభం కొనసాగుతున్న రీత్యా దేశంలో మృతదేహాలను ఖననం చేయకూడదని, కచ్చితంగా దహనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే..ముస్లిం మతాచారల ప్రకారం మృత దేహాలను ఖననం చేయాల్సి ఉండడంతో ఈ ఉత్తర్వులు అప్పట్లో కలకలానికి కారణమయ్యాయి. అయితే..అనేక అంతర్జాతీయ హక్కుల సంస్థలతో పాటూ అగ్రరాజ్యం అమెరికా కూడా శ్రీలంక నిర్ణయాన్ని విమర్శిచడంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. 

Read more