నందలూరు ‘కథా’నాయకుడు
ABN , First Publish Date - 2021-02-10T06:35:08+05:30 IST
నంబర్ టు స్థానాన్ని దక్కించుకోవడం కూడా ఘనతే. కథల మాస్టారు కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళంలో ఒంటి చేతి మీదుగా ‘కథానిలయం’ స్థాపించి...
అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ : 5.6.1962–31.01.2021
2003లో నందలూరులో కథానిలయం స్థాపించాక రాష్ట్రంలో రెండోదిగా, రాయలసీమలో మొట్టమొదటిదిగా ఈ కథానిలయం పేరుపడింది. వేలాది రూపాయల సొంత ఖర్చుతో సొంత భవనంలో నందలూరులో కథానిలయం ఏర్పాటు చేసినందుకు రాజేంద్రప్రసాద్ వందలాది మంది అభిమానులను సంపాయించుకున్నాడు. రాష్ట్రంలోనే పేరున్న రచయితల కలాలు సృష్టించిన కథా సాహిత్యపు ప్రత్యేక సంచికలు దాదాపు 1500 కథా సంపుటాలను సేకరించి, చిన్నా పెద్ద కథలను సుమారు ఏడువేల వరకూ కథా నిలయంలో కొలువుదీర్చాడు.
నంబర్ టు స్థానాన్ని దక్కించుకోవడం కూడా ఘనతే. కథల మాస్టారు కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళంలో ఒంటి చేతి మీదుగా ‘కథానిలయం’ స్థాపించి తెలుగు కథకు ఒక గూడు, ఒక గుడి కట్టారు. అలాంటి పని రాష్ట్రం మొత్తం మీద మరొకరు చేయలేకపోయారు. ఆ పనిని నందలూరు రాజేంద్రప్రసాద్ చేయగలిగారు, నందలూరులో కథానిలయం స్థాపించాడు కాబట్టే అలవోకగా నంబర్ టు అయ్యారు.
కథా సాహిత్యం మీద ఆయనకు కలిగిన ఈ అభిలాష ముచ్చటైనది. ఆ ముచ్చట గురించి తెలుసుకోవాలంటే ఆయన బాల్యంలోకి ఒకసారి తొంగి చూడాల్సిందే.
రాజేంద్రప్రసాద్ సొంతూరు పొత్తపి. మారుమూలగ్రామం. తండ్రి సుబ్బయ్య ఉపాధ్యాయుడు కావడంతో గ్రామంలో ఈ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. తండ్రి సిపిఐకి చెందిన ప్రాథమిక ఉపాధ్యాయ సంఘానికి రాజంపేట సమితి శాఖకు అధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. అప్పట్లో చిట్వేలి సమితి ప్రెసిడెంట్‌గా ఉన్న మలిశెట్టి చిన్నయ్య రెండో కొడుకు సారంగ్ చదువు కోసం ప్రత్యేకంగా వెంకటరాజుపల్లెలో వారింట్లోనే ఒక టీచర్‌ను ఏర్పాటు చేశారు. ఆ టీచర్ చెంచయ్య పొత్తపి గ్రామం మనిషి కావడంతో తండ్రి సుబ్బయ్య తన కొడుకు రాజేంద్రప్రసాద్‌ను కూడా వెంకటరాజుపల్లె లోనే ఉంచి సారంగ్‌తో పాటు చదివించారు. మూడు నుంచి అయిదో తరగతి వరకూ రాజేంద్రప్రసాద్ అక్కడే చదువుకున్నారు.
అప్పుడు మలిశెట్టి చిన్నయ్యగారింటికి రాష్ట్రంలోని అన్ని దిన, వారపత్రికలే కాకుండా ఎన్నో విజ్ఞానదాయకమైన పుస్తకాలనూ తెప్పించేవారు. రిపబ్లిక్ లైబ్రరీని కూడా నిర్వహించేవారు. ఆ వయసులో ఏమీ అర్థం కాకపోయినా ఆ పత్రికల మధ్యా, ఆ పుస్తకాల మధ్యా రాజేంద్రప్రసాద్ కాపురం చేశాడు. అప్పటి నుంచే పుస్తకాలు చదవడం వ్యసనమైపోయింది.
పుస్తకాలు చదవడం వల్ల అన్యాయం అంటే సహించలేని గుణం అబ్బింది. వామపక్ష భావాల వైపు ఆకర్షితుడై ఎఐఎస్‌ఎఫ్ కడప జిల్లా కార్యదర్శిగా పని చేశాడు. కడపలోని సిపిఐ జిల్లా కార్యాలయం హోచిమన్ భవన్‌లో మూడేళ్ళున్నాడు. సిపిఐ నాయకుడు ఎద్దల ఈశ్వర్‌రెడ్డి ఎన్నో పుస్తకాలను తెప్పించేవారు. వాటినీ వదిలిపెట్టలేదు రాజేంద్రప్రసాద్. జాతీయ అంతర్జాతీయ పోకడలను తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండడం వల్ల పుస్తకపఠనం అనేది ‘అనుభూతి’ స్థాయికి చేరింది. 1987లో టీచర్ ఉద్యోగంలో చేరాక కూడా రాజేంద్రప్రసాద్ క్రమంగా దిన, వార పత్రికలు చదివేవాడు. క్రమేణా కథా సాహిత్యంపై ఎనలేని వ్యామోహాన్ని పెంచుకున్నాడు. మొట్టమొదట 20 వేల రూపాయలను వడ్డీకి తెచ్చి, ఏక్‌దమ్మున పుస్తకాలు కొన్నాడు. వాటికి ప్రత్యేకంగా ఇంట్లో షెల్ఫ్ చేయించి ముచ్చట తీర్చుకున్నాడు.
సమాజంలోని అనేక వర్గాలకు చెందిన అనేకానేక వ్యక్తుల బాధలకు, కన్నీళ్ళకు, ఆవేదనలకు, ఆనందాలకు, విజయాలకు, అపజయాలకు ఆ మాటకొస్తే మానవజీవితపు సమస్త కోణాలకు, సమస్త పార్శ్వాలకు కథానిక అచ్చమైన నిలువుటద్దం. ఈ భావజాలమే నన్ను నందలూరులో కథానిలయం ఏర్పాటు చేసే దాకా నిలవనీయలేదు. ‘ఏదో ఒక మంచి పని చేసినప్పుడు, చేస్తున్నప్పుడు కలిగే మనశ్శాంతి అనిర్వచనీయమైనది’ అనేవాడు అబ్బిగారి రాజేంద్రప్రసాద్.
2003లో నందలూరులో కథానిలయం స్థాపించాక రాష్ట్రంలో రెండోదిగా రాయలసీమలో మొట్టమొదటిదిగా ఈ కథానిలయం పేరుపడింది. వేలాది రూపాయల సొంత ఖర్చుతో సొంత భవనంలో నందలూరులో కథానిలయం ఏర్పాటు చేసినందుకు రాజేంద్రప్రసాద్ వందలాది మంది అభిమానులను సంపాయించుకున్నాడు. రాష్ట్రంలోనే పేరున్న రచయితల కలాలు సృష్టించిన కథా సాహిత్యపు ప్రత్యేక సంచికలు దాదాపు 1500 కథా సంపుటాలను సేకరించి, చిన్నా పెద్ద కథలను సుమారు ఏడువేల వరకూ కథా నిలయంలో కొలువుదీర్చాడు.
కడప జిల్లా యర్రగుంట్ల ప్రాంతానికి చెందిన ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పేరు మీద 2005లో సింగమనేని నారాయణకు, 2006కు గానూ ప్రతిమకు అవార్డులను అందజేశారు.
కడప జిల్లాకు సంబంధించి 1956వ సంవత్సరం నుంచి 2006 వరకూ జిల్లాలోని 47 కథా రచయితలతో ‘కడప కథ’ అనే కథల సంపుటిని నందలూరు కథానిలయం అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రచురణకర్తగా వ్యవహరించి సొంత ఖర్చులతో ప్రచురించాడు. జిల్లాలో మొట్టమొదటి కథా రచయిత భారతం నాదముని రాజు నుంచి నేటి యువతరం రచయితల వరకు ఇందులో ఉన్నాయి. కథా సాహిత్య రంగానికి సేవలు చేసినందుకు నందలూరులోనే కాకుండా జిల్లాలో వివిధ సంస్థలు కథామిత్ర తదితర అవార్డులతో రాజేంద్రప్రసాద్‌ను పలుమార్లు సన్మానించాయి. రాజేంద్రప్రసాద్‌ను ఎంతమందైనా సన్మానించవచ్చు గాని ‘కథ’ను మాత్రం రాజేంద్రప్రసాద్ కొన ఊపిరున్నంత వరకు, చివరి రక్తపుబొట్టు తనలో ప్రవహించినంత వరకూ సన్మానిస్తూనే ఉంటారు.
కోట పురుషోత్తం
(నేడు నందలూరులో అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ సంతాప సభ)

