‘ఉక్కు’పై ఐక్య పోరాటమే శరణ్యం!
ABN, First Publish Date - 2021-02-09T08:49:30+05:30
పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు శక్తులపరం కాకూడదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐక్యపోరాటమే శరణ్యమని మేధావి వర్గాలు అభిప్రాయపడ్డాయి.
రౌండ్‌టేబుల్ సమావేశంలో మేధావుల ఉద్ఘాటన
కార్మిక సంఘాల ఉద్యమానికి సంఘీభావం
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), సీతంపేట ఫిబ్రవరి 8: పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటు శక్తులపరం కాకూడదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐక్యపోరాటమే శరణ్యమని మేధావి వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. కార్మిక సంఘాల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. పరిశ్రమకు సొంత గనులు లేవన్నది సాకు మాత్రమేనని, గనులు సమకూర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా? అని నిలదీశారు. స్వార్థ ప్రయోజనాలతో కుంటిసాకులు చూపించి, పరిశ్రమను ప్రైవేటీకరించాలనుకుంటే అంగీకరించబోమని, తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ జీఎస్ ఎన్‌రాజు, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్‌దా్‌స, నన్నయ వర్సిటీ మాజీ వీసీ జార్జి విక్టర్, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజశర్మ పాల్గొన్నారు.
తెలుగు ప్రజల హక్కు: మానవ హక్కుల వేదిక
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెలుగు ప్రజలు ఒక హక్కుగా పోరాడి సాధించుకున్నారని మానవ హక్కుల వేదిక పేర్కొంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుధ, ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వీఎస్ కృష్ణ ఒక ప్రకటనలో ఖండించారు.