నేటితో ఉత్కంఠకు తెర

ABN , First Publish Date - 2021-03-14T05:33:40+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నేటితో ఉత్కంఠకు తెర

  1. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  2. కర్నూలు కార్పొరేషన్‌కు 344 టేబుళ్లు
  3. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు 371 టేబుళ్లు
  4. విధుల్లోకి 4వేల మంది ఉద్యోగులు  


కర్నూలు(అర్బన్‌/కలెక్టరేట్‌), మార్చి 13: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. ఒక కార్పొరేషన్‌, 7 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. వీటన్నింటి ఫలితాలు ఆదివారం వెలువడతాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. కౌంటింగ్‌ కోసం కర్నూలు కార్పొరేషన్‌కు 344 టేబుళ్లు, 7 మున్సిపాలిటీలు, ఒక నగర  పంచాయతీకి 371 టెబుళ్లను ఏర్పాటు చేశారు. 4 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటారు. రాయలసీమ యూనివర్సీటీ, పుల్లయ్య ఇంజనీరింగ్‌ కాలేజీ, సెయింట్‌ జోసఫ్స్‌ కాలేజీ నందికొట్కూరు రోడ్డు, కర్నూలు, నంద్యాల పాలిటెక్నికల్‌ కళాశాలలు, ఆదోనిలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూరులో బనవాసి నవోదయ రెసిడెన్షియల్‌ పాఠశాల, డోన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ వీరపాండియన్‌ పరిశీలించారు. అభ్యర్థులు, సిబ్బంది, ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. 


నగరంలో లెక్కింపు

కర్నూలు కార్పొరేషన్‌ బ్యాలెట్‌ బాక్సులను 19 స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచారు. వీటిని 33 లెక్కింపు గదులకు ఉదయం చేరుస్తారు. ఓట్ల లెక్కింపు కోసం 344 టెబుళ్లు ఏర్పాటు చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 41, 42, 43 ,44 వార్డుల ఓట్లను లెక్కిస్తారు. జి. పుల్లయ్య ఇంజనీరింగ్‌ కాలేజీలో 9, 10, 11, 12, 13, 14, 15, 16, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33,, 36, 45, 47, 48 వార్డుల ఓట్లు లెక్కిస్తారు. సెయింట్‌ జోసెఫ్స్‌ జూనియర్‌, డిగ్రీ కాలేజీలో 17, 18, 19, 20, 21, 22, 23, 24, 37, 38, 39, 40, 49, 50, 51, 52 వార్డుల ఓట్లు లెక్కిస్తారు.


బెట్టింగ్‌ల జోరు

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. అభ్యర్థుల గెలుపోటములపై రూ.కోట్లు పందెం కాశారని విశ్వసనీయ సమాచారం. నగరంలోని పాతబస్తి, వెంకటరమణ కాలనీ, కల్లూరు మండలం, కొత్త బస్టాండ్‌, బళ్లారి చౌరస్తా తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌ జోరుగా కొనసాగుతోంది. పలు రాజకీయ పార్టీల నాయకుల అనుచరులు, అభిమానులు విజయం తమ పార్టీదే అని పందెం కాస్తున్నారు. 


ఫలితాలపై ఉత్కంఠ

కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడతాయి. 2005లో కార్పొరేషన్‌కు చివరి ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలకు 2014లో చివరి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత వివిధ కారణాలతో పాలకవర్గాలు లేకుండానే పాలన సాగింది. ఆశావహులు ఎన్నికల కోసం ఏళ్లతరబడి ఎదురు చూశారు. వారి ఆశలు ఫలించి, ఇన్నాళ్ల తరువాత ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న పోలింగ్‌ నిర్వహించారు. సర్వశక్తులు ఒడ్డి ఎన్నికల బరిలో నిలిచివారు ఫలితాల కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. కొందరు అభ్యర్థులు రూ.లక్షలు వడ్డీకి తెచిచ మరీ ఖర్చు చేశారు. కొందరు ఆస్తి, ఇళ్ల పత్రాలను తాకట్టు పెట్టారు. ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు. తీర్పు ముగిసింది. ఫలితం మరి కొన్ని గంటల్లో వెలువడనుంది. 


18న మేయర్‌ ఎన్నిక

కర్నూలు కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికను ఈ నెల 18వ తేదీన చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మేయర్‌ ఎన్నిక కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. దీంతోపాటు మేయర్‌ ఎన్నికకు హాజరుకావాలని నోటీసు ఇస్తారు. సాధారణంగా మేయర్‌ ఎన్నికకు మూడు రోజుల ముందు సభ్యులకు నోటీస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెల 17న అధికారులు విప్‌ జారీ చేస్తారు. కర్నూలు కార్పొరేషన్‌ మేయర్‌తో పాటు ఆదోని, నంద్యాల, డోన్‌, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాల్టీలు, గూడూరు నగర పంచాయతీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఈ నెల 18న ఎన్నుకుంటారు. 


Read more