Share News

కాళేశ్వరం కూలిపోవడం కేసీఆర్ అవినీతికి నిదర్శనం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:31 PM

కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భతమని కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు.

కాళేశ్వరం కూలిపోవడం కేసీఆర్ అవినీతికి నిదర్శనం: సీఎం రేవంత్‌రెడ్డి
CM RevanthReddy

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భతమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు. ఈ రోజు (సోమవారం) మేడిగడ్డ బ్యారేజీను పరిశీలించి ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎన్డీఎస్ఏ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో అధికారులకు పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.


ఆ లోపాలపై స్పష్టత వచ్చింది..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో ఓ స్పష్టత వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సమస్యను అర్థం చేసుకోవడమే సగం పరిష్కారమని చెప్పుకొచ్చారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే అధికారులు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సేకరించిన శాంపిల్స్ రిజల్ట్‌కు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి పనిలో ఎన్డీఎస్ఏ అప్రూవల్ తీసుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావును.. కాళేశ్వర్ రావు అని అప్పటి గవర్నర్ నరసింహన్‌తో చెప్పించారని ప్రస్తావించారు. కేసీఆర్ అవినీతిని ప్రకృతే గుర్తించి మొదట బయటకు తీసిందని తెలిపారు. 2023 ఎన్నికల ముందు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పుకొచ్చారు. అన్ని విషయాల్లో కాళేశ్వరం విఫలమైందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు.


సీబీఐ విచారణ ఎందుకు జరపలేదు..

కాళేశ్వరంపై శాసనసభలో చర్చించి సీబీఐ విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. తొమ్మిది నెలలైనా కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై తమ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి తీర్మానం పంపిందని అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావును జైల్లో వేయాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రెడ్డి ఆనాడు అనలేదా అని ప్రశ్నించారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. అంతకుముందు సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారని.. కానీ ఇప్పటి వరకూ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. కాళేశ్వరం విచారణపై సీబీఐ ఎందుకు మౌనంగా ఉంది..? అని నిలదీశారు. తాము పదే పదే లేఖలు రాసినా ఎందుకు స్పందిచడం లేదు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరంపై లక్షకోట్లు ఖర్చుచేసి లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. దీనిని తాము వదిలేయలేక, దీనిపై ఖర్చు చేయలేక సాంకేతిక నిపుణులతో ఇక్కడికి వచ్చామని అన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేస్తాం..

కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ నిర్వహించిన సమావేశానికి అధికారులతో, సాంకేతిక నిపుణులతో చర్చించాలని నెల రోజుల ముందే ప్లాన్ చేశామని తెలిపారు. నిజాలు బయటపడతాయని తెలిసి నేడు హడావుడిగా కేసీఆర్ అండ్ కో ఓ మీటింగ్ పెట్టుకుందని.. అయినా మేం అనుమతులు ఇచ్చామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు తెలివితో మాట్లాడుతున్నారో, తెలివిలేక మాట్లాడుతున్నారో తెలియట్లేదని ఎద్దేవా చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టుకు ప్రాణవాయువు అని ఉద్ఘాటించారు. హరీశ్‌రావు నిక్కర్‌తో తిరక్కముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉందని విమర్శించారు. ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక పంటలు పండించారని ప్రస్తావించారు. కాళేశ్వరంలో దోషులను వదిలేది లేదని హెచ్చరించారు.. దోషులను శిక్షించేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును కూడా ఊరికే వదలబోమని.. రిపేర్లు చేసి నీరు అందిస్తామని పేర్కొన్నారు.


అందుకే కేసీఆర్ మీటింగ్..

అయితే కేసీఆర్ హయాంలో చేసిన బండారం బయటపడుతుందని వాళ్లు ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీబీఐ విచారణ జరుపుతారని బీజేపీ వాళ్ల కాళ్లు మొక్కించేందుకే హరీశ్‌రావు, వినోద్ రావు ఢిల్లీకి పోయారని విమర్శించారు. కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని తెలిసి బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీశ్‌రావు ఢిల్లీకి పరుగెత్తారని విమర్శించారు. మీడియా బయటపెట్టినా వాళ్లు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన ఎందుకు చేయలేదని నిలదీశారు. బీజేపీని అడ్డుపెట్టుకుని అవినీతి కేసుల నుంచి బయటపడతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తామన్నారు. హరీశ్‌రావు ఢిల్లీ రహస్య పర్యటన మీడియా బయట పెట్టిందని తెలిపారు. హరీశ్‌రావు రహస్య పర్యటన వెనక మతలబు ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎవరెవరిని కలిశారో హరీశ్‌రావు బయటపెట్టాలని సవాల్ విసిరారు. జడ్జిమెంట్ ప్రకటించకముందు వాదించడానికి వీలుండదని అన్నారు. మరి న్యాయవాదులను కలవడానికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.


తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం..

గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని 1975 లో జలగం వెంగళరావు ఆనాటి మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2009లో రూ.38, 063 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టారని పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్లకు రూ.11,700 కోట్లు ఖర్చు చేశారని ప్రస్తావించారు. ప్రాణహిత చేవేళ్లతో ఆర్థిక, రాజకీయ ప్రయోజనం లేదని కెసీఆర్ రీడిజైనింగ్ పేరుతో పేరు, ఊరు అంచనాలు మార్చారని ఆగ్రహించారు. అంచనాలను రూ.1లక్షా 50 వేల కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. 2016లో మొదలుపెట్టిన మేడిగడ్డను 2019లో పూర్తిచేశామని ప్రారంభించారని తెలిపారు. ఇది అద్భుతమని భ్రమలు కల్పించి 2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారని మండిపడ్డారు. 2023లోనే మేడిగడ్డ కుప్పకూలిందని అన్నారు. అన్నిటినీ దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023, నవంబర్ 1వ తేదీన ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చిందని ప్రస్తావించారు. ఆ నివేదికను కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ దోపిడీపై పీసీ ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్

33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 20 , 2026 | 08:58 PM