Share News

కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:39 PM

కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్‌ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.

కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్‌ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు. సీబీఐకి ఘోష్ కమిషన్‌ పంపిన రిపోర్టుల్లో ఎవరి పేర్లను మెన్షన్ చేయలేదని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి ఉత్తమ్ ఈరోజు (బుధవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, హైకోర్ట్ తీర్పుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను కొట్టివేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని... కానీ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదని స్పష్టం చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని తెలిపారు. కమిషన్ ఫైండింగ్స్‌ను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని చెప్పుకొచ్చారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం జీవో ఎంఎస్ నంబర్ -6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని న్యాయస్థానం స్పష్టం చేసిందని పేర్కొన్నారు.


బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు..

కమిషన్ ఏర్పాటు అధికార పరిధిని మించింది కాదని.. అసమంజసం కాదని, అక్రమం కాదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్దారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని చెప్పారు. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసు ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్ని తప్పుపట్టిందన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని పిటిషనర్లకు రిలీఫ్ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని నిర్ణయించిందని అన్నారు. సీబీఐకు లేఖ రాశామని ప్రస్తావించారు. ఈ రోజు వెలువడిన హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదని.. న్యాయస్థానం ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ముమ్మాటికీ నిజమన్నారు. ప్రాజెక్టుకు ఎంచుకున్న సైట్ నుంచి డిజైన్ల నుంచి నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్ల అవకతవకలు జరిగాయని.. అన్నీ లోపాలే ఉన్నాయని.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారికి నోటీసులు ఇవ్వలేదనే కారణంగా, వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్స్ మాత్రమే ఇన్ ఆపరేటివ్‌గా ఉంటాయని హైకోర్టు తెలిపిందని అన్నారు. ఇది పూర్తిగా ప్రొసిజరల్, టెక్నికల్ అంశమని చెప్పుకొచ్చారు.


కాళేశ్వరం ప్రజల కళ్లముందే కుంగిపోయింది..

కాళేశ్వరం ప్రజల కళ్లముందే కుంగిపోయిందని.. 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ బ్యారేజీ దగ్గరికు వెళ్తే ఎవరికైనా కుంగిన తీరు కనపడుతుందన్నారు. లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీ మూడేళ్లకే కుంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ల హయంలోనే కుంగిపోయిందని అన్నారు. అందుకు కారణాలేమిటో తేల్చాల్చిన బాధ్యత.. తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారి తీసిన కారణాలు, డిజైన్ల, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాథమిక నివేదికను బీఆర్ఎస్ హయాంలోనే సమర్పించిందని అన్నారు. బ్యారేజీలకు ఎంచుకున్న ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలన్నింటినీ తమ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్ బయటపెట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇంజనీర్లను, ఐఏఎస్‌లను, అప్పటి పరిపాలనా బాధ్యులను విచారించి నివేదికను వెల్లడించిందని తెలిపారు. బాధ్యులెవరు, దోషులెవరు.. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో తేలుస్తామని చెప్పారు. ఏమేం లోపాలున్నాయో.. ఎన్డీఎస్ఏతో పాటు విజిలెన్స్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలపై ఆగస్టులోనే తమ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టిందని ప్రస్తావించారు.


సీబీఐ విచారణకు ఇబ్బంది లేదు..

విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్డిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికల ఆధారంగా దర్యాప్తు జరపాలని సీబీఐ విచారణకు ప్రభుత్వం లేఖ రాసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన తమ ప్రభుత్వం ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. హైకోర్టు తీర్పుతో సీబీఐ విచారణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తీర్పు కాపీ వచ్చాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రెండేళ్లుగా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తుందని అన్నారు. కేవలం రెండు ఫిల్లర్లు కాదని.. మొత్తం పౌండేషన్.. మొత్తం మూడు బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నాయని.. ఇప్పటికే దేశంలో పేరొందిన సంస్థల నిపుణులందరూ అభిప్రాయపడ్డారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా మానవ తప్పిదమని చెప్పుకొచ్చారు. దేశంలోనే ఇది అతి పెద్ద విధ్వంసమన్నారు. అమూల్యమైన ప్రజాధనం వృథా అయిందని.. దీనికి బాధ్యులెవరో ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 04:52 PM