ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
ABN , Publish Date - Apr 21 , 2026 | 09:43 PM
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కీలక మలుపు తిరిగింది. టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం కీలక మలుపు తిరిగింది. టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ (TGSRTC JAC), ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె బాట పట్టాలని జేఏసీ నాయకులు నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన తాజా చర్చల్లో సమస్యలకు తక్షణ పరిష్కారం కనిపించలేదని తెలిపారు. ఐఏఎస్ అధికారుల కమిటీ నాలుగు వారాల సమయం కోరగా, దానికి తాము అంగీకరించలేదని వెల్లడించారు. ఇప్పటికే చాలాకాలంగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, మరింత ఆలస్యం సహించలేమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
అర్ధరాత్రి నుంచి సమ్మె..
జేఏసీ నాయకుల ప్రకటన ప్రకారం, ఈరోజు(మంగళవారం) అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించనున్నారు. ఈ సమ్మె తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మార్చి 13వ తేదీన సమ్మె నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. సమ్మెకు ముందురోజే చర్చలకు పిలవడం సరైన విధానం కాదని జేఏసీ నాయకులు విమర్శించారు.
ప్రధాన డిమాండ్లు ఇవి..
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, వేతన సవరణ అన్ని గతంలో ఇచ్చిన హామీలేనని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పారు. 32 సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె చేస్తామని హెచ్చరించారు. రేపు సమ్మె యథాతధంగా ఉంటుందని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
గత్యంతరం లేని పరిస్థితి..
జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గత్యంతరం లేక సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అధికారుల కమిటీ సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పినా, స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలిపారు.
కార్మికులకు పిలుపు..
జేఏసీ నాయకులు కార్మికులకు కీలక పిలుపునిచ్చారు. ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని, సమ్మెను ఐక్యంగా కొనసాగించాలని సూచించారు. అన్ని డిపోల్లో సమ్మె విజయవంతం చేయాలని కోరారు.
ప్రజలపై భారం..
ఈ సమ్మె కారణంగా బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. ప్రైవేట్ రవాణాపై ఆధారపడాల్సి రావచ్చు. ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య త్వరగా పరిష్కారించాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. కార్మికుల సమ్మె తెలంగాణలో కీలక పరిణామంగా మారింది. చర్చలు విఫలం కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, జేఏసీ వైఖరి ఈ సమ్మె భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం
నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News