నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం
ABN , Publish Date - Apr 20 , 2026 | 09:14 PM
తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో భయంకర పరిస్థితులు ఉండేవని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ పదం పలకడానికే భయపడే రోజులు ఉండేవని పేర్కొన్నారు.
జగిత్యాల, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో భయంకర పరిస్థితులు ఉండేవని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ పదం పలకడానికే భయపడే రోజులు ఉండేవని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్‌లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేరారని తెలిపారు. 45 ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డితో తమకు స్నేహం ఉందని ప్రస్తావించారు. ఈరోజు(సోమవారం) జగిత్యాలలో కేసీఆర్ పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి..
ఈ సందర్బంగా కేసీఆర్ ప్రసంగించారు. భిన్న రాజకీయ పార్టీల వల్లే జీవన్‌రెడ్డి, తాము వేర్వేరుగా పనిచేశామని అన్నారు. జీవన్‌రెడ్డి గుండె ధైర్యంతో పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జీవన్‌రెడ్డిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని వెల్లడించారు. ఆయన ప్రజాజీవితం ఎంతోమందికి ఆదర్శమని ప్రశంసించారు. జీవన్‌రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌కు ఊపు వస్తోందన్నారు. జీవన్‌రెడ్డితో కలిసి అన్నదమ్ముల్లా తాము పనిచేస్తామని వివరించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డికి తక్షణ బాధ్యతలు ఇస్తామని స్పష్టం చేశారు. కరీంనగరే కాదని.. చుట్టుపక్కల జిల్లాల్లోనూ జీవన్‌రెడ్డి పనిచేయాలని సూచించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీవన్‌రెడ్డి కీలక బాధ్యతల్లో ఉంటారని పేర్కొన్నారు.
తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు ఉన్నాయి..
గతంలో తెలంగాణ పదాన్నే నిషేధించే పరిస్థితులు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. మన నీళ్లు, వనరులను దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. కొన్ని పార్టీల తీరుతో ఆవేశం, దు:ఖం వచ్చేదని చెప్పుకొచ్చారు. పాలమూరు లాంటి జిల్లాల్లో 90 శాతం వలసలే ఉన్నాయని ప్రస్తావించారు. గంజి కేంద్రాలు పెట్టిన అధ్వాన స్థితికి తెలంగాణను చేర్చారని తెలిపారు. కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. దారుణ పరిస్థితులు ఉండేవని అన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచారని చెప్పారు. కరెంట్ ఛార్జీలపై నిరసన తెలిపితే బషీర్‌బాగ్‌లో కాల్చి చంపారని విమర్శించారు. బషీర్‌బాగ్ ఘటనతోనే తెలంగాణ జెండా పట్టుకుని ఉద్యమం చేశానని ప్రస్తావించారు. బక్కపలచనోడు, ఇతనితో ఏమవుతుందని కొంతమంది తనను హేళన చేశారని గుర్తుచేశారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ దీక్ష చేపట్టా..
మొక్కవోని దీక్షతో తెలంగాణ మొత్తం తిరిగి ఉద్యమించానని కేసీఆర్ ఉద్ఘాటించారు. మాజీ సీఎం రోశయ్య 14F జీవో తెస్తే ఉద్యోగ గర్జన చేపట్టామని ప్రస్తావించారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అంటూ దీక్ష చేపట్టానని తెలిపారు. తన దీక్షతో పార్లమెంట్ అల్లకల్లోలమైందని అన్నారు. మాజీ కేంద్రమంత్రి చిదంబరం వచ్చి తెలంగాణ ఇస్తామని ప్రకటన చేశారని తెలిపారు. ఆంధ్రోళ్ల ఒత్తిడితో మళ్లీ JAC పెట్టి పోరాడామని చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చాక అందరినీ కలుపుకుని ఓ ప్రణాళికతో ముందుకెళ్లామని అన్నారు. కాకతీయ రాజుల పేరుతో చెరువులు బాగుచేసుకున్నామని తెలిపారు. పదేళ్లలో ఎన్ని చేశామో మీరే చూశారని ప్రస్తావించారు. మిషన్ భగీరథ పూర్తికాకపోతే ఓట్లు వేయొద్దని.. అసెంబ్లీలోనే తాను చెప్పానని అన్నారు. ఐదేళ్లలోనే మిషన్ భగీరథ పూర్తిచేసి మంచినీళ్లు ఇచ్చామని వ్యాఖ్యానించారు. ఈ కాంగ్రెస్ హయాంలో మిషన్ భగీరథను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆగ్రహించారు.
వెయ్యి జన్మలెత్తినా తాను చావను..
తాను చావాలి అంటూ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. తనను విమర్శించే వారు వెయ్యి జన్మలెత్తినా తాను చావనని తెలిపారు. పిల్లి శాపాలకు చస్తామా..? అని ఎద్దేవా చేశారు. తాను చావాలంటూ కాంగ్రెస్ నేతలు శాపాలు పెడితే తాను చస్తానా..? అని ప్రశ్నించారు. చివరి శ్వాస ఉన్నంతవరకు తాను తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణలో సరిగా కరెంట్ వస్తోందా..? అని ప్రశ్నించారు. పంటపొలాలు ఎండిపోయి ప్రజలు ఏడుస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేసేటప్పుడు.. ఆలోచించి ఓట్లు వేయాలని ఆనాడే తాను చెప్పానని ప్రస్తావించారు. వీళ్లు రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటారని తాను చెప్పానని అన్నారు. ఒక్కసారే వేయాల్సిన రైతుబంధును ఒక్కో ఎకరానికి ఒక్కోసారి ఇస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో తాము ఒకేసారి రైతుబంధు వేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు నోటికొచ్చిన మాటలు.. ఇష్టమొచ్చిన కథలు చెప్పారని విమర్శించారు. వీళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని.. ఇప్పుడు గోస పడుతున్నారని చెప్పారు. 1.7 శాతం ఓట్ల తేడాతోనే మనం ఓడిపోయామని ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లినా తాను ఎక్కడా మాట్లాడలేదని అన్నారు. తాము రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చామని స్పష్టం చేశారు.
నేను సభ పెడితేనే రెండోవిడత రైతుబంధు ఇస్తారా..?
తమ హయాంలో ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ధర ఉండేదని కేసీఆర్ ప్రస్తావించారు. ఇప్పుడు అమ్మేవాళ్లు ఉన్నారు కానీ.. కొనేవాళ్లే లేరని చెప్పారు. ఈ కాంగ్రెస్ సర్కార్‌కు యూరియా బస్తాలు కూడా ఇవ్వడం చేతకావడం లేదని మండిపడ్డారు. యాప్‌ల పేరుతో కాళ్లకు వాపులు తప్ప ఏమీ లేదని విమర్శించారు. జగిత్యాలలో తాను సభ పెడితేనే.. రెండోవిడత రైతుబంధు ఇస్తున్నారని తెలిపారు. మళ్లీ తాను సభ పెడితేనే మూడోవిడత రైతుబంధు ఇస్తారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల జీవితాలు ఆగమయ్యాయని చెప్పారు. ఈ ప్రభుత్వంలో అంతా దోపిడీ, గూండాగిరి, అరాచకాలేనని ఆరోపించారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పున: నిర్మాణం జరగాలని సూచించారు. ఈ కాంగ్రెస్ సర్కార్‌ను పోరాటం చేసి నిలదీయాల్సిందేనని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ పున: నిర్మాణ యజ్ఞం ప్రారంభం కావాలని సూచించారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలని.. కాంగ్రెస్ పోవాలి.. బీఆర్‌ఎస్ రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
హైడ్రా రద్దుపైనే నా తొలి సంతకం..
హైదరాబాద్‌లో హైడ్రాను తీసుకొచ్చారని.. నిజామాబాద్‌లోనూ తెస్తామని అంటున్నారని ప్రస్తావించారు. పేదల ఇళ్లను కూల్చివేయడమేనా..? ఈ ప్రభుత్వ పని అని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని అన్నారు. హైడ్రా రద్దుపైనే తన తొలి సంతకం ఉంటుందని స్పష్టం చేశారు. మూసీ కోసం వేల ఇళ్లు కూల్చేస్తారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ఆరోపించారు. మూసీ సుందరీకరణ చేయొద్దని తాను అనడం లేదని.. కానీ పేదల ఇళ్లు కూల్చివేయడం ఎందుకని..? నిలదీశారు. రైతులకు నష్టమనే మీటర్లు పెట్టడానికి తాను ఒప్పుకోలేదని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి మోకరిల్లి మీటర్లు పెడుతోందని.. మీటర్ల ఏర్పాటుపై తాను యుద్ధం చేస్తానని కేసీఆర్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్
33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి
Read Latest Telangana News And AP News And International News And Telugu News