రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Apr 20 , 2026 | 10:06 PM
రైతు భరోసా రెండో విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని స్పష్టం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా రెండో విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) విడుదల చేశారు. 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం.. కాంగ్రెస్ నినాదమే కాదు, విధానమని ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధర తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. వరికి రూ.500 బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నొక్కిచెప్పారు. ఈరోజు(సోమవారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
ప్రతిపక్ష హోదా కూడా ఊడగొడతాం..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఊడగొడతామని హెచ్చరించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహించారు. కేసీఆర్‌కు ఉరి వేసినా తప్పులేదని హెచ్చరించారు. వరుస ఎన్నికల విజయంతో బీఆర్ఎస్‌కు ఘోరీ కట్టామని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం.. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ప్రజాపాలనో.. పాపాల భైరవుడో తేల్చుకుందామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఘోరీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. YS, DSలా తాను, మహేశ్ కుమార్ గౌడ్ చరిత్రను పునరావృతం చేస్తామని స్పష్టం చేశారు. 2034 వరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
20 వేల ఇళ్లు కూడా కట్టలేదు..
కార్యకర్తల సాక్షిగా ఇదే తన సవాల్ అని సీఎం పేర్కొన్నారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నందుకు ప్రజాపాలన పోవాలా..? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని.. కానీ 20 వేల ఇళ్లు కూడా ఎందుకు కట్టలేదని నిలదీశారు. తమ హయాంలో 4.5 లక్షల ఇళ్లు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలా..? అని ప్రశ్నించారు. జీవన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనందుకు ప్రజాపాలన పోవాలా..? అని నిలదీశారు.
జీవన్‌రెడ్డి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు..
ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలని జీవన్‌రెడ్డి అంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు గడీల పాలన పోవాలనే.. కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నారని ప్రస్తావించారు. జీవన్‌రెడ్డి మాజీ సీఎం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కరరావుతో జతకట్టారని విమర్శించారు. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు జీవన్‌రెడ్డిని పల్లకీపై మోశారని ప్రస్తావించారు. తమ ప్రభుత్వం గడీలకు ఊడిగం చేయాలా..? అని ప్రశ్నించారు. గతంలో ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు కట్టి పండుగ చేసుకున్నారా..? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచించారా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్
33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి
Read Latest Telangana News And AP News And International News And Telugu News