Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:14 PM
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్, సెప్టెంబరు15 (ఆంధ్రజ్యోతి): మాసబ్‌ట్యాంక్ (Masabtank) మంగర్ బస్తీ నాలాలో (Mangar Basti Nala) భారీ వర్షానికి వచ్చిన వరద నీటిలో మామ అల్లుళ్లు రాము, అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. నిన్న(ఆదివారం) రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, మంగర్ బస్తీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath), హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఇవాళ(సోమవారం) పర్యటించారు. ఇద్దరు వ్యక్తులు గల్లంతవడంపై అధికారుల నుంచి రంగనాథ్, కలెక్టర్ హరిచందన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.
అక్రమ నిర్మాణంతో ఘటన..
హైదరాబాద్‌లో (Hyderabad) చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న(ఆదివారం) రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని చెప్పుకొచ్చారు. నాలాపై ఒక అక్రమ నిర్మాణం నీటి ప్రవాహానికి అడ్డు పడిందని వెల్లడించారు. ఈ బస్తీలో కొన్ని ఇళ్లను తొలగించి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి తాము వచ్చామని పేర్కొన్నారు.
సమస్యాత్మకంగా నాలాలు..
హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న(ఆదివారం) ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారని వివరించారు. వారిలో ఇద్దరు వ్యక్తులు మరణించారని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో రెండు వేల ట్రక్కుల సిల్ట్ తీశామని చెప్పుకొచ్చారు. చాలా నాలాలు సమస్యాత్మకంగా ఉన్నాయని వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరించడానికి హైడ్రా కృషి చేస్తోందని తెలిపారు. హైడ్రా ఉన్నది ప్రజల కోసమేనని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
బాధితులకు నష్ట పరిహారం: కలెక్టర్ హరిచందన
నాలా ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం రూ.5 లక్షలు చెల్లిస్తామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన (Hyderabad Collector Harichandana) తెలిపారు. ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఇంకా దొరకలేదని, దొరికిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నాలాల వద్ద ఉండే ప్రజలు వరద ఉధృతి ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఈ బస్తీలో కొన్ని నిర్మాణాలు నాలాలపై ఉన్నాయని తెలిపారు. అలాంటి వాటితో అందరికీ ప్రమాదం ఉందని హెచ్చరించారు కలెక్టర్ హరిచందన.
ఇందిరమ్మ ఇళ్లు..
ఈ బస్తీ వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు. ఈ బస్తీలో 145 ఇళ్లు నాలా మీద ఉన్నాయని వెల్లడించారు. మొత్తం రెండు ఎకరాల్లో అనేక ఇళ్లు ఉన్నాయని అన్నారు.. ఈ బస్తీలోని వారికి గతంలో అనేకసార్లు నోటీసులు ఇచ్చామని గుర్తుచేశారు. మంగర్ బస్తీ వాసులు ఒప్పుకుంటే మరొక చోట నివాస ప్రాంతాలు కల్పిస్తామని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ అభ్యర్థి..?
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News