కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయించు.. బండి సంజయ్‌కు ఎంపీ చామల సవాల్
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:25 PM
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమో చెప్పాలని ఎద్దేవా చేశారు. అసలు నవగ్రహాల్లో ఆయన ఉన్నారా...? అని ప్రశ్నించారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బండి సంజయ్ ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలోని పెండింగ్ సమస్యలను పరిష్కారించాలనే ఆలోచన ఆయనకు ఏమైనా ఉందా...? అని నిలదీశారు. మెట్రో ఫేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో బండి సంజయ్ వైఖరి ఏంటి..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే సభను కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఏర్పాటు చేయాలని.. ఈ సభ కోసం పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకువచ్చే బాధ్యత తమదని చెప్పుకొచ్చారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు చేయట్లేదు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే 24 గంటల్లో చర్యలు చేపడతామని కిషన్ రెడ్డి అన్నారని.. మరి ఇప్పుడేమి చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 2025 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఇస్తే ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేయట్లేదని నిలదీశారు. అనవసరమైన అంశాల్లో కేంద్ర జేబు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ శాఖ పరిధిలోనే సీబీఐ ఉంది కదా...? అని ప్రస్తావించారు. బండి సంజయ్ ఏ గ్రహమో చెప్పిన తర్వాత.. తెలంగాణకు ఏం చేశారో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కుప్పకూలిందని అన్నారు. కాళేశ్వరంలో బీఆర్ఎస్ లక్ష కోట్లు దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పిన మోదీ అండ్ కో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఎంపీగా, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారని ప్రస్తావించారు. కాంగ్రెస్‌కి కాళేశ్వరం ఏటీఎంగా మారడానికి అక్కడ ఏముందో బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు.
జీవన్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయాలని అనుకున్నాం..
జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లి ఆలోచన లేని పని చేశారని.. కేసీఆర్ ఆయనకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా చేయాలని అనుకున్నామని తెలిపారు. నిన్నటితో జీవన్ రెడ్డి ఎపిసోడ్ అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్‌లో అలిగినట్లు బీఆర్ఎస్‌లో ఆయన అలిగితే ఎవరు పట్టించుకోరని సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్‌లో అలిగితే టీపీసీసీ ప్రెసిడెంట్, ఏఐసీసీ సెక్రటరీలు జగిత్యాల దాకా వచ్చి ఆయనతో మాట్లాడారని ప్రస్తావించారు. జనరల్ సెక్రటరీ పదవికి కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రాముఖ్యం ఉంటుందో జీవన్ రెడ్డికి తెలుసునని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పీసీసీ ప్రెసిడెంట్‌గా చేసి బీఆర్ఎస్‌లో చేరితే ఇప్పుడు పరిస్థితి ఏంటి...? అని ప్రశ్నించారు. పొన్నాలకు పట్టిన గతే.. రేపు జీవన్ రెడ్డికి పడుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం
నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News