Share News

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ABN , Publish Date - Jun 06 , 2026 | 08:52 PM

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అష్టదరిద్రులు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా వాళ్లను పట్టించుకోమని విమర్శించారు.

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి
Telangana CM Revanth Reddy

రంగారెడ్డి, జూన్6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అష్టదరిద్రులు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా వాళ్లను పట్టించుకోమని విమర్శించారు. అసూయ పడేవాళ్లు, అజీర్ణం చేసుకునేవాళ్లు ఎప్పుడూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఈరోజు(శనివారం) కోహెడలో సీఎం రేవంత్‌‌రెడ్డి పర్యటించారు. ఫ్రూట్‌ మార్కెట్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లకు శంకుస్థాపన చేశారు. రూ.2,284 కోట్లతో 239 ఎకరాల్లో ఫ్రూట్‌ మార్కెట్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. కాళేశ్వరంలో చుక్కనీరు ఎత్తిపోయకుండా లక్షల మెట్రిక్‌ టన్నుల పంట పండలేదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లున్నా కాళేశ్వరం నీళ్లు అనేవారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు వెచ్చిస్తే గోదావరి పాలయ్యాయని మండిపడ్డారు.


మర్యాద తప్పితే.. పొలిమేరలు కూడా దాటనివ్వం..

కేసీఆర్ హయాంలో విధ్వంసం చేస్తే.. తాము వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసూయ, పగ తమపై చూపండని.. కానీ ప్రజలపై కాదని చెప్పారు. సమస్యలు వస్తే పారిపోమని.. నిలబడి కొట్లాడి పరిష్కరించుకుంటామని అన్నారు. ఫామ్‌హౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. చేతకాకపోతే దిగిపొమ్మంటున్నారని.. తాము అల్లాటప్పాగా రాలేదని చెప్పారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సంగతి చెబుతామని హెచ్చరించారు. మర్యాద తప్పితే.. పొలిమేరలు కూడా దాటనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. మోదీని చూపి భయపెట్టాలనుకుంటే.. ఇక్కేవరూ భయపడేవారు లేరని చెప్పుకొచ్చారు. ఈనెల 15వ తేదీ తర్వాత వడ్లు కొనకపోతే మోదీ సర్కార్ సంగతి చూస్తామని హెచ్చరించారు. తమకు మాటలే కాదని.. చేతలు కూడా తెలుసునని అన్నారు. కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరం వేగంగా విస్తరిస్తోందని వ్యాఖ్యానించారు.


వ్యవసాయం కుంటుపడింది..

భూముల ధరలు బాగా పెరిగాయని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ పెరగడంతో వ్యవసాయం కుంటుపడిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్‌ చుట్టూ కూరగాయలు పండేవని వెల్లడించారు. గడ్డిఅన్నారం నుంచి ఫ్రూట్‌ మార్కెట్‌ని ఇక్కడికి తరలించారని ప్రస్తావించారు. రేకుల షెడ్లు వేస్తే.. అవి గాలి దుమారానికి ఎగిరిపోయాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ మార్కెట్‌ నిర్మిస్తామని తాము హామీ ఇచ్చామని చెప్పారు. పండ్ల మార్కెట్‌ కోసం తాము చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూశారని ధ్వజమెత్తారు. అందరి అవసరాలు తీర్చేలా మార్కెట్‌ నిర్మాణం చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌తో ఏటా రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో రైతులు అన్ని రకాల పండ్లు పండించాలని ఆకాంక్షించారు. ఫార్మాసిటీ వద్దని ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం చేయబోతున్నామని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఇక్కడికి తీసుకురాబోతున్నామని వివరించారు.


ఔర్‌ ఏక్‌ బార్‌.. కాంగ్రెస్‌ సర్కార్‌.. మా నినాదం..

కాలుష్యం లేని పరిశ్రమలే ఈ ప్రాంతానికి వస్తాయని సీఎం రేవంత్‌‌రెడ్డి వెల్లడించారు. ఫ్యూచర్‌ సిటీ, మార్కెట్‌, RRR వద్దంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు వద్దని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు. వరంగల్‌ ఎయిర్‌పోర్టు కావాలని గతంలో తాము పోరాడితే.. ఇప్పుడు అష్టదరిద్రులు అడ్డం పడుతున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చేద్దామంటే అడ్డుపడుతున్నారని.. ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు. 2034 వరకు ప్రజాపాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఔర్‌ ఏక్‌ బార్‌.. కాంగ్రెస్‌ సర్కార్‌.. తమ నినాదమని ఉద్ఘాటించారు. అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఎంతమంది అడ్డంపడినా అభివృద్ధి పనులు ఆగవని తేల్చిచెప్పారు. సదుపాయాలు ఉంటేనే అంతర్జాతీయ స్థాయి నగరం అవుతుందని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు

పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు

Read Latest Telangana News And AP News  And National News

And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 09:01 PM