తెలంగాణకు వ్యతిరేకంగా.. పవన్ ఎప్పుడూ మాట్లాడలేదు: రాంచందర్ రావు
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:37 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్‌కి అనుమతి ఇస్తే ఏమవుతుంది? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పడూ మాట్లాడలేదని అన్నారు..
హైదరాబాద్, జూన్4 (ఆంధ్రజ్యోతి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్‌కి అనుమతి ఇస్తే ఏమవుతుంది..? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా.. పవన్ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఈరోజు (గురువారం) హైదరాబాద్ వేదికగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్‌ని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంని ఎందుకు దగ్గరకు తీసుకున్నారని ప్రశ్నించారు.
కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి..
పవన్ కల్యాణ్.. జనసేన సభ కోసం అనుమతి అడిగారని... ఇచ్చి ఉంటే కథ అక్కడే ముగిసేదని.. సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ సర్కార్ చెప్పాలని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఈ సమావేశం పెట్టుకోవడం ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్య హక్కు అని చెప్పారు. దాన్ని అడ్డుకోవడమే ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. పవన్ కల్యాణ్ అంశాన్ని బీజేపీ మీద రుద్దే ప్రయత్నం చేయడం రాజకీయ దివాళాకోరుతనమని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిస్తేనే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.
నిజాలు మాట్లాడాలి..
తెలంగాణ సెంటిమెంట్ పేరుతో మళ్లీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాంచందర్ రావు ఆగ్రహించారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారితో చేతులు కలిపింది ఎవరో..? బీఆర్ఎస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని శక్తులతో అధికార రాజకీయాలు చేసింది ఎవరు..? అని నిలదీశారు. తెలంగాణను తిట్టిన వారిని, ఉద్యమకారులను అవమానించిన వారిని బీఆర్ఎస్‌లో చేర్చి పదవులు ఇచ్చింది ఎవరు..? అని ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో రాజకీయాలు చేసే ముందు మీ రాజకీయ చరిత్రను ఒకసారి ప్రజలకు గుర్తు చేయాలని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద ప్రేమ ఉంటే డ్రామాలు కాదని... నిజాలు మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రజలు ఇప్పుడు భావోద్వేగాలకు కాదని, మీ గతానికి కూడా లెక్క అడిగే స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
వారికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవులు ఇచ్చారు..
తెలంగాణను వ్యతిరేకించిన వారికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవులు ఇచ్చారని రాంచందర్ రావు ఆగ్రహించారు. ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ పెట్టలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ నిధులను పంజాబ్‌లో కేసీఆర్ పంచలేదా..? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేని పరిస్థితిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీజేపీ సపోర్ట్ చేయడంతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు.
జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
కాంగ్రెస్ సర్కార్ ఇస్తానని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది..? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. 12 ఏళ్ల నుంచి నీళ్ల మీద ఒక పాలసీ కూడా ఎందుకు తేలేదని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా కంటే తక్కువ వాటాను కేసీఆర్ ఒప్పుకున్నారని ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను డీకే శివకుమార్‌కి.. రేవంత్‌రెడ్డి బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను అప్పుల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సూపర్ హీరో అని రాంచందర్ రావు అభివర్ణించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్‌లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News