తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:26 AM
తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈరోజు(బుధవారం) సీఎం రేవంత్‌రెడ్డిని.. దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం ఎంసీహెచ్‌ఆర్డీలో కలిశారు.అధికారిక పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా బృందం హైదరాబాద్ వచ్చింది. ఈ సమావేశంలో పెట్టుబడులపై సీఎంతో.. పాలస్ మషటైల్ బృందం చర్చించింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి దామోదర రాజనరసింహ, సీఎస్ రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా సమాచార సాంకేతికత, తయారీ, మౌలిక సదుపాయాలు, ఫార్మా, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకార అవకాశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ తెలంగాణ ప్రత్యేకతలని వివరించారు.
దక్షిణాఫ్రికా కంపెనీలు తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఇరు ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ కూడా తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక రంగ పురోగతిపై ఆసక్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో మరింత సహకారం కొనసాగించేందుకు ఇరు పక్షాలు సానుకూలంగా స్పందించాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News