కాళేశ్వరంపై హరీశ్‌రావు సూచనల మేరకే ఈటల రాజేందర్ మాట్లాడారు.. సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:26 PM
కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్, జులై 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి హరీశ్‌రావు సూచనల మేరకే ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఎంపీ ఈటల అవాస్తవాలు చెప్పారని ధ్వజమెత్తారు. ఎంపీ ఈటల అంటే తమకు గౌరవమేనని తెలిపారు. ఆ వ్యాఖ్యలతో ఈటల తన గౌరవం పోగొట్టుకున్నారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. కేసీఆర్ హయాంలో 2019 జూన్ 21వ తేదీన కాళేశ్వరం ప్రారంభించారని తెలిపారు. ఈరోజు(శనివారం) సచివాలయంలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు.
కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ లోపాలు..
కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ లోపాలు బయటపడ్డాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే లోపాలు బయటపడ్డాయని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని.. 2020 మే 18వ తేదీన ఈఈ రమణారెడ్డి కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాశారని ప్రస్తావించారు. లోపాలు సవరించాలని అప్పట్లోనే ఇంజినీర్లు సూచించారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యంతో లోపాలు పెరిగి పెద్దవై బ్యారేజ్ కుప్పకూలిందన్నారు. 2022 జులై 14వ తేదీన వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ దెబ్బతిందని చెప్పారు. ఇప్పటికీ కన్నెపల్లి పంప్‌హౌస్ వినియోగంలోకి రాలేదని తెలిపారు. 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని ప్రస్తావించారు.
గతంలోనే ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఇచ్చింది..
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ (NDSA) కమిటీ ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కావని ఎన్డీఎస్ఏ తేల్చిచెప్పిందని అన్నారు. ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం, నిర్వహణ లోపాలపై.. గతంలోనే ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఇచ్చిందని ప్రస్తావించారు. ప్రాథమిక, తుది నివేదికల్లో ఎన్డీఎస్ఏ అదే విషయం చెప్పిందని అన్నారు. లోపాలు సవరించాలని నిపుణులు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. మొదట్లోనే స్పందించకపోవడంతో ఈ సమస్య పెద్దది అయిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్‌రావు తమ ప్రభుత్వంపై పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్ పాలసీ తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం మీడియా కృషి చేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News