పది పరీక్షలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:02 PM
పదో తరగతి పరీక్షలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పదో తరగతి పరీక్షలు లేనట్లేనన్నారు. దేశమంతా +2 విధానం అమల్లో ఉందని ప్రస్తావించారు. తమది వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ఇకపై పదో తరగతి పరీక్షలు లేనట్లే'నని చెప్పారు. ప్రస్తుతం.. దేశమంతా +2 విధానం అమల్లో ఉందని ప్రస్తావించారు. తమది వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు(శుక్రవారం) చిట్‌చాట్ చేశారు.
ఆ కేసుల్లో చట్టప్రకారమే ముందుకెళ్తాం..
ఫార్మూలా ఈ-కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో చట్టప్రకారమే ముందుకెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాము తొందరపడితే టెక్నికల్ రీజన్స్‌తో కోర్టు తిరస్కరించే ప్రమాదముందని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయస్థానంలో ఊరట లభించలేదన్నారు. చక్రధర్ గౌడ్.. హరీశ్‌రావుపై పెట్టిన ఫోన్ ట్యాపింగ్, వేధింపుల కేసులో ఆయనకు రిలీఫ్ లభించిందని ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనను విచారణకు రమ్మని నోటీసులిస్తే హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పూర్తి కాకుండా చర్యలు తీసుకోలేమని అన్నారు. కేసీఆర్ బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. తెలంగాణ జాతిపిత ఎవరో ప్రజలు డిసైడ్ చేయాలన్నారు.
గ్యారంటీలపై ఓ ప్రణాళిక ఉంది..
ఏ గ్యారంటీ ఎప్పుడు అమలు చేయాలో తమ దగ్గర ప్రణాళిక ఉందని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో అప్పులు, తప్పులు కప్పిపుచ్చి పాలన చేశారని ఎద్దేవా చేశారు. ఆ తప్పులు తాము చేయలేమన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3.47లక్షల కోట్ల అప్పులు చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులను తీర్చేందుకే తామీ అప్పులు చేయాల్సి వచ్చిందని ప్రస్తావించారు. ఈ 26 నెలల్లో రూ.3.3 లక్షల కోట్లు కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల్నే తమ ప్రభుత్వం తీర్చిందని చెప్పుకొచ్చారు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా రూ.44 వేల కోట్ల కాళేశ్వరంపై అప్పు తీర్చామన్నారు. హిల్టు టీడీఆర్ భూ బదలాయింపులపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఏ విచారణ కోరినా చేపట్టేందుకు సిద్ధమని స్పష్టం చేశారు సీఎం.
ఆ భూములు అమ్మితే లక్ష కోట్లు రావు..
ఇండస్ట్రీకు చెందిన మొత్తం భూములు అమ్మినా లక్ష కోట్ల రూపాయలు రావని ముఖ్యమంత్రి తెలిపారు. హిల్టులో ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. మంత్రి అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ కోసం సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ గవర్నర్‌ను సంప్రదిస్తామని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను తొలగించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. ఇప్పుడున్న జిల్లాలు మండలాల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పులూ ఉండవని ఆయన స్పష్టం చేశారు. విద్యాశాఖ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కేకే కమిటీకి రిఫర్ చేశామని పేర్కొన్నారు.
భూముల అమ్మకానికి వ్యతిరేకం కాదు..
భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని సీఎం స్పష్టం చేశారు. భూములు అమ్మితే వచ్చిన డబ్బులను సొంతానికి వాడుకోవడానికి తాము వ్యతిరేకమన్నారు. మూసీ విషయంలో ఆగేది లేదన్నారు. నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కపెట్టిన వాళ్లు తాను ఎన్ని నిధులు తెచ్చానో కూడా లెక్కపెట్టాలని హితవు పలికారు. గాంధీ మనుమడు కూడా ఒక పౌరుడేనని.. ప్రస్తుతం ఆయనా బీఆర్ఎస్ ట్రాప్‌లో పడ్డారని అన్నారు. డ్రగ్స్ అంశంలో ఇంత జరుగుతుంటే.. బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను తిడితే బీజేపీ ఎందుకు మాట్లాడుతోందని నిలదీశారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని అన్నారు. తనను సీఎంగా అంగీకరిస్తున్న మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. జీవన్ రెడ్డి అంశాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చూసుకుంటారన్నారు. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వానిది.. తమది కాదని సీఎం పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విప్‌ల నియామకం..
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు
Read Latest Telangana News And AP News And International News And Telugu News