హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత నాది: తుమ్మల నాగేశ్వరరావు
ABN , Publish Date - Mar 19 , 2026 | 07:30 PM
ఉగాది పండుగ అంటేనే రైతు పండగ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దేశంలోనే అధికంగా వరి తెలంగాణలోనే సాగవుతోందని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ అంటేనే రైతు పండగ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Telangana Minister Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. దేశంలోనే అధికంగా వరి తెలంగాణలోనే సాగవుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరిధాన్యం కొనమని స్పష్టంగా చెబుతోందని, కావున రైతన్నలు ఇతర పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఈరోజు(శుక్రవారం) నంగునూర్ మండలం నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద రైతుమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఆయిల్ పామ్ రాష్ట్ర రైతుల గుండె చప్పుడని ఉద్ఘాటించారు.
ఆయిల్ పామ్ సాగు చేయాలి..
45ఏళ్లుగా ఆయిల్ పామ్ కోసం అహర్నిశలు కృషి చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఆయిల్ పామ్ సాగు కోసం ఎంతగానో కృషి చేశారని ప్రస్తావించారు. హరీశ్‌రావు గతంలో తన తోటలోని ఆయిల్ పామ్ సాగును చూసి రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని ఆలోచన చేశారని అన్నారు. హరీశ్‌రావుతో ఆయిల్ పామ్ సాగు చేయించే బాధ్యత తనదని చెప్పుకొచ్చారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాప్రతినిధులు మొదట ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. వరిసాగులో కూడా ఆయిల్ పామ్ సాగు చేయొచ్చని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్‌పై ఇంపోర్ట్ డ్యూటీని పాత పద్ధతిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని 16 నెలల్లో ఆధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
రాష్ట్రంలో ఎక్కడ రిఫైనరీ లేదు..
రాష్ట్రంలో ఎక్కడ రిఫైనరీ లేదని, సిద్దిపేటలో రిఫైనరీకి సీఎం రేవంత్‌రెడ్డి రేపు(శుక్రవారం) శంకుస్థాపన చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూడు రోజుల పాటు ఇక్కడ రైతు మేళా కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని నిష్ణాతులైన సైంటిస్టులతో ఇక్కడ రైతన్నలకు అవగాహన కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలో మరో 5 ఆయిల్ పామ్ ప్యాక్టరీలు ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్పొరేషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..
హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...
Read Latest Telangana News And AP News And International News And Telugu News