కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:07 PM
మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటి హక్కులను కాలరాశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ నీటి హక్కులను కాలరాశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఏపీకి మంచి మనిషి అని, కానీ తెలంగాణకు ముంచే మనిషి అని ఎద్దేవా చేశారు. నీటి హక్కులను వారే కాపాడినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పల్నాడు వాటర్ గ్రిడ్ విషయంలో బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పల్నాడు వాటర్ గ్రిడ్‌పై ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా నీటిని ఎలా తాకట్టుపెట్టారో నిరూపిస్తామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నీటి విషయంలో ప్రతిపక్షాల నేతలు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలనే బీఆర్ఎస్ నమ్ముకుందని ఎద్దేవా చేశారు.
పల్నాడు వాటర్ గ్రిడ్‌ను జగన్ హయాంలోనే నిర్ణయించారు..
పల్నాడు వాటర్ గ్రిడ్‌ను తాము అడ్డుకోలేదని ప్రతిపక్షాల నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోని 2022లో పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన జీఓ విడుదలైందని గుర్తుచేశారు. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని జగన్ హయాంలోనే నిర్ణయించారని అన్నారు. అప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆరే ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో ఆనాడు కేసీఆర్ ఎందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. పల్నాడు వాటర్ గ్రిడ్‌పై తాము ఎప్పుడో అభ్యంతరం తెలిపామని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టును ఆపాలని ఏపీకి, కేంద్రానికి, కేఆర్ఎంబీకి వరుసగా లేఖలు రాశామని ప్రస్తావించారు. తాము అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిపెడుతుంటే.. గులాబీ పార్టీ నేతలు పదేపదే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్‌ను బద్నాం చేసేందుకు వారు కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. 2004లో వైఎస్సార్ మంత్రివర్గంలో హరీశ్‌రావు ఉన్నారని గుర్తుచేశారు. అప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచారని తెలిపారు. అప్పట్లో నాయిని నర్సింహారెడ్డి కడప ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారని చెప్పారు. 2005లో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడే.. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ప్రవేశపెట్టారని అన్నారు.
వైఎస్సార్ మోచేతి నీళ్లు తాగింది మీరు కాదా?..
2005 సెప్టెంబరులో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై జీఓ వచ్చిందని, నాడు అసెంబ్లీలో గులాబీ పార్టీ నేతలు నిలదీయకుండా ఇప్పుడు డ్రామాలు చేస్తారా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు పాపంలో బీఆర్ఎస్ నేతలకు భాగం లేదా..? అని ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్ మోచేతి నీళ్లు తాగింది మీరు కాదా? అని నిలదీశారు. హరీశ్‌రావుకు నిజమైన గురువు వైఎస్సార్ అని చెప్పారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ద్వారా వైఎస్సార్‌కు.. హరీశ్‌రావు గురుదక్షిణ చెల్లించుకున్నారని ఆరోపించారు. 2004లో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడే.. హంద్రీనీవా సుజల స్రవంతికి 40 టీఎంసీలు మళ్లించేలా జీఓ ఇచ్చారని తెలిపారు. ఇది తెలంగాణ నీటి హక్కులకు సమాధి కట్టడం కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు మరణశాసనం రాసింది మీరు కాదా..? అని నిలదీశారు. 2015లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని.. నాటి కేంద్రమంత్రి ఉమాభారతి సమక్షంలో సంతకాలు చేశారని ప్రస్తావించారు. కృష్ణాకు సంబంధించిన 71శాతం పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉందని తెలిపారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉన్నా.. 299 టీఎంసీలు చాలని సంతకాలు చేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ హక్కులకు శాశ్వత సమాధి కట్టారు..
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకు ఇవే కేటాయింపులు ఉండేలా.. 2020 జనవరిలో శాశ్వత ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులకు శాశ్వత సమాధి కట్టారని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లాకు నీటిని తరలించేలా 2022 జగన్ హయాంలో జీఓ తెచ్చారని తెలిపారు. ఈ విషయంపైనా నాడు కేసీఆర్ అభ్యంతరం ఎందుకు తెలపలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు కోల్పోవడానికి కేసీఆరే కారణమని ఆగ్రహించారు. వాస్తవాలు ఇలా ఉంటే తమపై దుష్ప్రచారమా..? అని ధ్వజమెత్తారు. తమ చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. 2023-24లో కృష్ణా నుంచి ఏపీ 208 టీఎంసీలు తీసుకుందని తెలపారు. ఇదే సమయంలో 119 టీఎంసీలే తెలంగాణ తీసుకుందని వెల్లడించారు. శ్రీశైలం నుంచి నిత్యం 11 టీఎంసీలు తరలించేందుకు.. ఏపీ ఏర్పాట్లు చేసుకుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News