కాళేశ్వరం విచారణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:58 PM
కాళేశ్వరం అవినీతి విచారణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం అవినీతి విచారణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి ఈరోజు(బుధవారం) తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. వాటిని చట్టపరంగా సమర్థవంతంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా తగిన ఆధారాలను సమర్పించలేకపోవడం వల్ల, కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపితమైందని ఎద్దేవా చేశారు.
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు..
ఈరోజు రాష్ట్ర హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కిషన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారని ప్రస్తావించారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం అన్నారని చెప్పారు.. అలాగే, ఫార్ములా వన్ రేస్ పేరు మీద చేసిన ఖర్చులు, డ్రగ్స్ కేసు, భూ ఆక్రమణలు, భూ కేటాయింపులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని.. అవినీతి సొమ్మును కక్కిస్తానని పదే పదే రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ వాటిపై ఒక్కటంటే ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై.. రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోకపోవడానికి కారణం.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తీయేనని విమర్శించారు.
ఈ రెండు పార్టీలవి ‘డూప్ ఫైటింగ్’
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ‘డూప్ ఫైటింగ్’ చేస్తూ.. ‘నేను గిచ్చినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయి’ అన్నట్లుగా వ్యవహారిస్తున్నాయని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కోసం.. మార్పు కావాలని కాంగ్రెస్‌కు ఓటేశారని తెలిపారు. కానీ రేవంత్ సర్కార్.. హామీలను మాటలకే పరిమితం చేస్తూ.. అవినీతికి పాల్పడిన వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ.. తెలంగాణ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటోందని ఆరోపించారు. అందుకనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలకు కాంగ్రెస్ సర్కార్ వెనుకాడుతోందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు రాజకీయ ద్రోహం..
ఇది రేవంత్‌రెడ్డి పరిపాలనా వైఫల్యమని, ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణ ప్రజలకు చేస్తున్న రాజకీయ ద్రోహమని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, అసెంబ్లీలో, బయట ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే.. అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఎన్నికల హామీలు ఎందుకు అమలు కాలేదు..? అని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి..? అని నిలదీశారు. దొంగలు, దొంగలు కలిసి తెలంగాణను దోచుకోవడంలో పోటీపడుతూ.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా..? అని కిషన్‌రెడ్డి సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International News And Telugu News
కాళేశ్వరంపై సీబీఐతో విచారణ చేయించు.. బండి సంజయ్‌కు ఎంపీ చామల సవాల్