కవిత సంతోషపెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించొద్దు: కేటీఆర్
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:09 PM
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతోమంది జైలుకు వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు.
మంచిర్యాల, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) విషయంలో చెప్పేదేమీ లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) వ్యాఖ్యానించారు. పిల్లలు తండ్రిని సంతోష పెట్టకపోయినా ఫర్వాలేదు.. కానీ ఏడిపించవద్దని తెలిపారు. ఈ రాజకీయం ఉంటుంది, పోతుంది.. కానీ ఇతరులను బాధ పెట్టే తీరు మంచిది కాదని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చని అన్నారు. ప్రజల ఆదరణ లేకుంటే వృథానే కదా అని చెప్పారు. ప్రజల కోణంలో పార్టీ పెడితే తప్పు లేదని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత సమస్యలతో పార్టీ పెడితే ఎవరూ పట్టించుకోరని పేర్కొన్నారు. తమకు పొత్తులు కలిసి రావని స్పష్టం చేశారు. పొత్తులతో పోటీ చేసినప్పుడల్లా ఓడిపోయామని ప్రస్తావించారు. 2014, 2018లో ఒంటరిగానే పోటీ చేసి గెలిచామని, అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. 2023లో కూడా ఒంటరిగానే గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్‌తో.. బీజేపీ పొత్తు ప్రచారం అబద్ధం..
బీఆర్ఎస్‌తో.. బీజేపీ పొత్తు ప్రచారం అబద్ధమని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌తోనే బీజేపీకి అనుబంధం ఎక్కువగా ఉందని ప్రస్తావించారు. తెలంగాణలో సమస్యలపై మేధావులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదని అన్నారు. బీఆర్ఎస్ పేరు మార్పుపై అధినేత కేసీఆర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం) మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు.
డీలిమిటేషన్‌పై అభ్యంతరాల్లో అర్థం లేదు..
డీలిమిటేషన్‌తో కొత్త నాయకత్వానికి అవకాశాలు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలందరినీ సర్దుబాటు చేస్తామని అన్నారు. డీలిమిటేషన్‌పై అభ్యంతరాల్లో అర్థం లేదని.. దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు. ఇప్పుడున్న 545 ఎంపీల్లో సౌత్‌కు 24శాతం వాటా ఉందని ప్రస్తావించారు. 50శాతం సీట్ల పెంపుతో కూడా అదే వాటా వస్తుందని అన్నారు. ఇంకా అభ్యంతరం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలే తమకు ముఖ్యమని.. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
జైళ్లకు వెళ్తేనే సీఎం అవుతారనుకోవడం సరికాదు..
జైళ్లకు వెళ్తేనే సీఎం అవుతారనుకోవడం సరికాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతమంది జైలుకెళ్లారని ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు. క్షేత్రస్థాయి లోపాలతోనే తాము తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని కేటీఆర్ తెలిపారు. ఎవరు ఎక్కడ గెలుస్తారో అక్కడికి తమ నేతలను పంపిస్తామన్నారు. ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయంతోనే తాము ఓడిపోయామని చెప్పుకొచ్చారు. కార్యకర్తలతో కమ్యూనికేషన్ లోపం వల్ల నష్టపోయామని... దానిని మార్చే ప్రయత్నంలో తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ లాగా కేడర్‌తో సంబంధాలు పెంచుకుంటామని అన్నారు. రెండు నెలల తర్వాత సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాలకు కచ్చితంగా సాగునీరు అందిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై పీకో టెక్నాలజీ ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు
పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News