స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ABN , Publish Date - Oct 09 , 2026 | 02:19 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలపై వైసీపీది రెండు నాలుకల ధోరణి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలపై వైసీపీది రెండు నాలుకల ధోరణి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గం నర్సింగోలులో పర్యటించిన ముఖ్యమంత్రి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మీ భూమి-మీ హక్కు సభలో పాల్గొని, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం సీఎం ప్రసంగించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ నేతలు ఓడిపోతే... వచ్చే నాలుగు ఓట్లు కూడా తమకురావని భయపడుతున్నారని విమర్శించారు.
ఇక్కడ ఉంది 1995 సీబీఎన్..
ఈ ఎన్నికల్లో ఓడిపోతే తమ పార్టీ నేతలు ఇళ్లల్లో పడుకుంటారని జగన్ భయపడుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్లు పెట్టారని.. తాను దాన్ని 34 శాతానికి పెంచానని ప్రస్తావించారు. తాను 34శాతం రిజర్వేషన్లు పెంచితే జగన్ హయాంలో దాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఇక్కడ ఉంది 2014 సీబీఎన్ కాదని... 1995 సీబీఎన్ అని ఉద్ఘాటించారు. వైసీపీ హయాంలో 16,800 మంది స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని కోల్పోయారని దుయ్యబట్టారు. చట్టప్రకారం తాము బీసీలకు మళ్లీ రిజర్వేషన్లు పెంచితే గొడ్డలి పార్టీకి ఎందుకు ఇష్టం లేదని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్లకు జగన్ అండ్ కో అడ్డం పడ్డారు..
కోర్టుకెళ్లి బీసీ రిజర్వేషన్లకు జగన్ అండ్ కో అడ్డం పడ్డారని ముఖ్యమంత్రి ఆగ్రహించారు. 50 శాతానికంటే రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. వెనకబడిన వర్గాలంటే వైసీపీకి గిట్టదని మండిపడ్డారు. వారి రుణం తీర్చుకోవాలని తనకు తపన ఉందని చెప్పుకొచ్చారు. బీసీలకు 34శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇచ్చి గెలిపించుకుంటామని.. అది తన బాధ్యత అని ఉద్ఘాటించారు. వైసీపీ నేతలు ఒకపక్క ‘సర్’ ప్రక్రియ వద్దంటున్నారని.. కానీ మరోపక్క ‘సర్’ పూర్తి అయ్యేవరకు ఎన్నికలు వద్దని కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి వెనకబడిన వర్గాలు వెన్నెముక అని చెప్పుకొచ్చారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ స్పీడ్‌తో నడుస్తోందని వ్యాఖ్యానించారు.
డ్రోన్ టెక్నాలజీకి ఏపీ చిరునామా..
స్థానిక సంస్థల్లో త్రిబుల్ ఇంజిన్ వేగంతో ముందకెళ్తామని సీఎం తెలిపారు. ఏపీ అభివృద్ధిలో రాబోయే రోజుల్లో డ్రోన్ల భాగస్వామ్యం ఉంటుందని.. యుద్ధానికి కావాల్సిన డ్రోన్లు కూడా ఇక్కడే తయారవుతాయని వివరించారు. ఇరాన్‌లో యుద్ధం మనుషులు చేయలేదని.. డ్రోన్లతో చేశారని ప్రస్తావించారు. డ్రోన్ టెక్నాలజీకి ఏపీనే చిరునామాగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తామని వ్యాఖ్యానించారు. గోదావరి, కావేరి నదులు అనుసంధానం చేస్తే నాలుగు రాష్ట్రాలు, ఐదు జీవనాధులు అనుసంధానం అవుతాయని తెలిపారు. రామాయపట్నంలో రూ.1.50,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ నిర్మిస్తామని వెల్లడించారు. గోవా కంటే మించిన ప్రదేశం మన సూర్యలంక అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్‌ను మరింత ఉన్నతస్థాయికి మోదీ తీసుకెళ్తున్నారు: లోకేశ్
భోగాపురంతో ఉత్తరాంధ్ర మినీ ఎకనామిక్ సిటీగా మారుతుంది: రామ్మోహన్
హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News