ఏపీలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక డ్రైవ్.. తొలగించిన ఓట్లపై రీ - వెరిఫికేషన్ చేస్తాం: ఏపీ సీఈవో
ABN , Publish Date - Oct 07 , 2026 | 07:49 PM
ఓటర్ల జాబితా పున:పరిశీలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. తొలగించిన 46.62 లక్షల పేర్లను ఇంటింటికెళ్లి పరిశీలిస్తామని పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా పున:పరిశీలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ( Vivek Yadav) ప్రకటించారు. తొలగించిన 46.62 లక్షల పేర్లను ఇంటింటికెళ్లి పరిశీలిస్తామని పేర్కొన్నారు. రేపటి నుంచి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లనున్నారని తెలిపారు. తొలగించిన ఓటర్ల పరిస్థితిపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వెల్లడించారు. మరణం, శాశ్వత వలస, డూప్లికేట్ నమోదులతో ఓటర్లను తొలగించినట్లు స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ గణనలో 44,89,512 మంది ఓటర్లు అందుబాటులో లేరని గుర్తించామని అన్నారు. జులై 31వ తేదీన 3,71,38,182 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల చేశామని ప్రస్తావించారు.
నోటీసు దశలో మరో 1,73,071 మంది అనర్హులుగా గుర్తించామని సీఈవో వివేక్ యాదవ్ తెలిపారు. 46,62,583 మంది తొలగించిన ఓటర్ల జాబితాతో ఇంటింటికీ బీఎల్‌ఓలు వెళ్తారని చెప్పారు. పొరపాటున పేరును తొలగిస్తే ఫారం-6తో మళ్లీ నమోదు చేసుకోవచ్చని సూచించారు. బీఎల్‌ఓల పరిశీలన అనంతరం నిరంతర సవరణలో అర్హులైన వారి పేర్లను చేరుస్తామని వెల్లడించారు. కొత్తగా అర్హత పొందిన వారు కూడా ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తీసివేయకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అర్హత లేని నమోదులను ఓటర్ల జాబితాలో లేకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని సీఈవో వివేక్ యాదవ్ తెలిపారు. ఈనెల(అక్టోబరు) 16వ తేదీన ఏపీలో ఎస్‌ఐఆర్-2026 తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. తుది జాబితా తర్వాత కూడా నిరంతర సవరణ ద్వారా ఓటర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1 అర్హత తేదీలుగా ప్రకటించారు. తదుపరి జనవరి 1ను అర్హత తేదీగా వార్షిక సంక్షిప్త సవరణ చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడమే తమ లక్ష్యమని సీఈవో వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు
‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News