‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:02 PM
‘స్త్రీశక్తి’ పథకం 100 కోట్ల ప్రయాణాలను చేరుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళ మణులకు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘స్త్రీశక్తి’ పథకం 100 కోట్ల ప్రయాణాలను చేరుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళ మణులకు శుభాకాంక్షలు తెలిపారు. మన ఆడబిడ్డల ఆదరణతో, మాతృమూర్తుల ఆమోదంతో ‘స్త్రీశక్తి’ పథకం చరిత్రాత్మక మైలురాయిని చేరుకుందని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. గత ఏడాది అగస్టు 15వ తేదీన ప్రారంభమైన ‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు.
రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే.. ఈ పథకం రాష్ట్ర మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయినట్లుగా అర్థమవుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందని ఉద్ఘాటించారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి, తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందని చెప్పుకొచ్చారు.
ఇప్పటికీ ఈ పథకం ద్వారా మహిళలు రూ.3550 కోట్ల మేర ఆదా చేసుకున్నారని ముఖ్యమంత్రి వివరించారు. ఇలా ఆదా అయిన ప్రతి రూపాయి వారి పిల్లల చదువుకు, కుటుంబ అవసరాలకు, భవిష్యత్తుకు ఉపయోగపడాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని ఆదరిస్తున్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి సీఎం చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు చెప్పారు.
శభాష్ గాయత్రీ..
ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అక్కడ పనిచేసే గాయత్రీ అనే మహిళ సిబ్బంది అన్నం తినిపించి ఆకలి తీర్చింది. ఈ విషయంపై ఎక్స్ వేదికగా సీఎం ఆమెను అభినందించారు.
‘శభాష్ గాయత్రీ.! ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. ‘మానవ సేవే - మాధవ సేవ’ అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News