ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:00 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ జీవోలను జారీ చేసింది.
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం, గుంటూరు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవోలు జారీచేసింది. ఐజీపీ (IGP) లేదా డీఐజీ (DIG) హోదా కలిగిన అధికారి తిరుపతి పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తారని తెలిపింది. కొత్తగా ఏర్పడే తిరుపతి సీపీకి బిఎన్ఎస్ఎస్ (BNSS), 2023 సెక్షన్ 14(6) కింద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి పోలీస్ కమిషనరేట్‌లో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ అనే 4 టెరిటోరియల్ జోన్లను ఏర్పాటు చేసింది.
పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్, క్రైమ్, వీఐపీ భద్రత, శాంతిభద్రతల సమర్థ నిర్వహణ కోసం ఈ కమిషనరేట్ ఏర్పాటు చేసినట్లు ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. విజయవాడ సిటీ క్రైమ్స్ జాయింట్ సీపీ పోస్టును తిరుపతి పోలీస్ కమిషనర్ పోస్టుగా మారుస్తు ఉత్తర్వులు జారీ చేసింది. మెరైన్ వింగ్ ఎస్పీ పోస్టును డీసీపీ (తిరుమల)గా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ పోస్టును డీసీపీ (శ్రీకాళహస్తి)గా మార్పు చేసింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ పోస్టును డీసీపీ (తిరుపతి)గా, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ పోస్టును డీసీపీ (శ్రీసిటీ)గా మార్చింది. ఏపీఎస్పీ బెటాలియన్ సీఎంటీ-1 పోస్టును డీసీపీ (కోఆర్డినేషన్)గా కేటాయించింది. జిల్లాలో ఉన్న 4 అదనపు ఎస్పీ పోస్టులను అదనపు డీసీపీలుగా, 12 డీఎస్పీ పోస్టులను ఏసీపీ (ACP)లుగా పునర్నియామకం చేపట్టింది. తిరుపతి కమిషనరేట్ ఏర్పాటు కోసం ఎలాంటి కొత్త పోస్టులను సృష్టించడం లేదని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అలాగే, రాజమహేంద్రవరం పోలీసు కమిషనరేట్‌కి ఐజీపీ, డీఐజీపీ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారని ఏపీ సర్కార్ పేర్కొంది. నలుగురు డీసీపీలు, నలుగురు ఆదనపు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలను కేటాయించింది. గుంటూరు పోలీసు కమిషనరేట్‌కి ఐజీపీ లేదా డీఐజీపీ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారని వెల్లడించింది. డీసీపీలు ఐదుగురు, ఆదనపు డీసీపీలు నలుగురు, ఆరుగురు ఏసీపీలను ఏపీ సర్కార్ కేటాయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు
ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్
ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News