Share News

ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:08 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
Jairam Ramesh Fake News

అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల ఏపీలో పర్యటించిన విషయం తెలిసిందే. మదనపల్లెలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.


ప్రజల ఉత్సాహాన్ని ఆగ్రహంగా పొరబడవద్దు: సీఎం చంద్రబాబు

‘జైరాం రమేశ్ గారు, అక్కడ ఏమి జరిగిందో మీ వ్యాఖ్యానం అసలు వాస్తవానికి చాలా దూరంగా ఉంది. ప్రజల ఆగ్రహంగా మీరు అబద్ధంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నది, వాస్తవానికి ప్రజల నుంచి వచ్చిన అపారమైన, ఉత్సాహపూరితమైన స్పందన. సభలో వ్యక్తమైన తీవ్రమైన ఉత్సాహం కారణంగా, కార్యక్రమం సజావుగా సాగడానికి నేను కాసేపు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రజల ఉత్సాహాన్ని ఆగ్రహంగా పొరబడటం, ఆంధ్రప్రదేశ్, భారత్ ప్రజల మానసిక స్థితి నుంచి మీరు ఎంతగా వేరుపడిపోయారో మాత్రమే తెలియజేస్తుంది. రాజకీయం కోసం సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేసే కథనాలు ప్రజలు స్వయంగా అనుభవించిన, వ్యక్తపరిచిన భావాలను మార్చలేవు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


‘ఆ అబద్ధాన్ని డిలీట్ చేయండి’: లోకేశ్

​‘ఫేక్ న్యూస్‌ను ఎలా సృష్టిస్తారో.. దానిని నిజానిజాలు సరిచూసుకోకుండా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎలా ప్రచారం చేస్తారో అనడానికి ఇది నిదర్శనం. ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక యువత ఆర్థిక మంత్రి ప్రసంగానికి ఎటువంటి ఆటంకం కలిగించలేదు. ప్రచారంలో ఉన్న ఈ ప్రచారం ముమ్మాటికీ అబద్ధం. ఉత్సాహంగా ఉన్న జనం మధ్య జరిగిన సాధారణ సంభాషణను కావాలనే కట్ చేసి, మార్చి, అల్లిన కథనాన్ని ప్రచారం చేస్తున్నారు. శ్రీ జైరాం రమేష్ గారు, మీ స్థాయి సీనియర్ నాయకుడు పోస్టు చేసే ముందు నిజాలను సరిచూసుకోవాలి. కావాలని చేసే దుష్ప్రచారం సరైనది కాదు. ఆ అబద్ధాన్ని డిలీట్ చేయండి’ అని మంత్రి లోకేశ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.. పవన్, లోకేశ్ అభినందనలు

బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 09:29 PM