Share News

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:51 PM

అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఆవిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఆవిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. భారతదేశంలో ఎవరైనా క్వాంటమ్ గురించి ప్రస్తావిస్తే అది అమరావతి మాత్రమే అవ్వాలని కోరుకున్నారు. తాను ఐటీ ప్రారంభించినప్పుడు.. ప్రతి ఒక్కరూ తనను చూసి ఎగతాళి చేసేవారని పేర్కొన్నారు. పరిజ్ఞానం లేని సమాజం, సెల్‌ఫోన్ల గురించి తాను మాట్లాడుతున్నానని కొంతమంది అనే వారని అన్నారు. ఈరోజు (శనివారం) అంబేడ్కర్ కళావేదికలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026లో సీఎం చంద్రబాబు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.


క్వాంటమ్ వ్యాలీ గురించి అందరు మాట్లాడాలి..

నేడు ఐటీ టెక్నాలజీలో భారతీయుల్లో 33శాతం లేదా 35శాతం మంది తెలుగు వారే ఉన్నారని... అది ఐటీ బలమని సీఎం చంద్రబాబు వివరించారు. 25 సంవత్సరాల్లో అది మన ట్రాక్ రికార్డ్ అని ఉద్ఘాటించారు. ఐటీని మనం స్వీకరించామని.. అది ప్రారంభ దశ.. ఈ రోజు ఐఏ, క్వాంటమ్ దశ అని చెప్పుకొచ్చారు. నిన్నటి వరకు మనం సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడుకుంటున్నామని.. ఈ రోజు లేదా రేపటి నుంచి మనం క్వాంటమ్ వ్యాలీ గురించి అందరు మాట్లాడాలని, అది అమరావతి గురించి మాత్రమే ఉండాలని ఆకాంక్షించారు.


మొదట క్వాంటమ్ కంప్యూటింగ్‌ ఏర్పాటులో కొంత ఆలస్యం..

‘ఒక రోజు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి నాకు ఫోన్ చేశారు. సార్, ఒక ఆఫర్ ఉందని... IBM భారతదేశానికి క్వాంటమ్‌‌ను తీసుకురావాలనుకుంటోంది. ఇది అమెరికాలో అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం అంగీకరిస్తే, మనం దీన్ని చేపట్టవచ్చని చెప్పారు. వెంటనే నేను కేంద్రప్రభుత్వం ద్వారా విచారించాను. ఎవరూ ముందుకు రాకముందు, నేను దీని గురించి మాట్లాడటం ప్రారంభించాను. నా కోసం కొన్ని పోటీలు వచ్చాయి. మన రాష్ట్రం ఎందుకు కాకూడదు? అన్నట్లుగా దీని ఏర్పాటులో కొంత ఆలస్యం జరిగింది. ఆ మార్గంలో వెళ్లకుండా, నేను IBMతో నా మార్గాన్ని మార్చుకుని, TCS, L&Tతో చర్చించాను. మాకు ముగ్గురు భాగస్వాములు ఉన్నారు. ఒక నెల్లోనే మేము ఒక అవగాహనకు వచ్చి ఈ భాగస్వామ్యాన్ని నిర్మించగలిగాం. ఆ తర్వాత అమరావతికి క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోతోందని ప్రకటించాం. ఫిబ్రవరి 3వ తేదీన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


క్వాంటమ్ సిస్టమ్‌లకు క్యూశివ అని పేరు పెట్టారు..

‘ఈ రోజు మనం అమరావతిలోనే తయారు చేసిన 5 క్వాంటమ్ సిస్టమ్‌‌లను ప్రారంభిస్తున్నాం. ఈ 5 క్వాంటమ్ సిస్టమ్‌లకు క్యూశివ అని పేరు పెట్టారు. అక్కడే హార్డ్‌వేర్, ఇంటిగ్రేషన్, వాలిడేషన్, ఆర్కిటెక్చర్ వీటన్నింటికీ సంబంధించిన క్వాంటమ్ సిస్టమ్‌ను మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. మీరు అమెరికాలోని IBM నుంచి క్వాంటమ్ కంప్యూటర్‌ను తీసుకువస్తున్నారు, చాలా మంచిది. మనం ఎందుకు స్వయంగా తయారు చేయకూడదు? అది అసాధ్యమా? అని నేను మొదటిసారిగా అడిగాను. అది ప్రేరణగా నిలిచింది. వారు కలిసి పనిచేశారు. ఆ తర్వాత వారు విభిన్న భాగస్వాములను, ఈకోసిస్టమ్ భాగస్వాములను తీసుకువచ్చారు. మేధా టవర్స్‌లో క్యూశివ నుంచి 5 సిస్టమ్‌లు సిద్ధమయ్యాయి. రెండేళ్ల వ్యవధిలో అమరావతి నుంచే క్వాంటమ్ కంప్యూటర్‌ను పూర్తి చేయబోతున్నామని వారు నాకు అవగాహన కల్పించారు. మనం భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సరఫరా చేయొచ్చు, అవసరమైతే క్వాంటమ్ కంప్యూటర్లను ఎగుమతి కూడా చేసుకోవచ్చు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్‌ అంబానీ

ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతున్నాం: ఎంపీ శ్రీభరత్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 03 , 2026 | 07:43 PM