Share News

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. పంటలకు భారీ నష్టం

ABN , Publish Date - Apr 22 , 2026 | 08:58 PM

తెలంగాణలోని ములుగు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. పంటలకు భారీ నష్టం
Heavy Rains

ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు (Heavy Rains), వడగళ్ల వాన తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ముఖ్యంగా తెలంగాణలోని ములుగు, ఏపీలోని నంద్యాల జిల్లాలో కురిసిన వానకు సామాన్య ప్రజలతో పాటు రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.


ములుగు జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం..

ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. గాలుల ధాటికి పలు గ్రామాల్లో ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. ప్రజలు భయంభ్రాంతులకు గురయ్యారు. ఏటూరునాగారం - కమలాపూర్ మార్గంలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చేతికి వచ్చే దశలో ఉన్న మిర్చి, వరి పంటలు వడగళ్ల వానకు దెబ్బతినడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.


నంద్యాల జిల్లాలో నేలకొరిగిన తోటలు..

నంద్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి వందల ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలు కావడంతో రైతులు భారీగా నష్టపోయారు. రుద్రవరం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేలకూలిన విద్యుత్ తీగలు, స్తంభాలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని.. వాటిని తాకవద్దని అధికారులు సూచించారు. పంట నష్టపోయిన రైతులు తమ వివరాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు తెలిపాలని, ప్రభుత్వం నుంచి అందే సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రాబోయే కొన్ని గంటల్లో మళ్లీ వర్ష సూచన ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 09:25 PM