Share News

అలర్ట్.. ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకేసారి ఎండలు, వర్షాలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:53 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇలా విభిన్న వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

అలర్ట్.. ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకేసారి ఎండలు, వర్షాలు
AP Weather

అమరావతి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ, అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అసాధారణ వాతావరణ మార్పులకు ప్రధాన కారణం తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావమని వెల్లడించారు. ఈ ద్రోణి కారణంగా ఉత్తరాంధ్ర, తూర్పు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉండగా, రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రైతులు, ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


అకాల వర్షాలు - పిడుగుల హెచ్చరిక..

తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష సూచన ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

ప్రభావిత జిల్లాలు: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం (ఏలూరు జిల్లా), కాకినాడ జిల్లాల్లో రేపు (ఆదివారం), ఎల్లుండి (సోమవారం) తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ఉరుములు వచ్చేటప్పుడు రైతులు, పశుకాపరులు చెట్ల కింద ఉండరాదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.


ఎండల తీవ్రత.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..

ఏపీవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని.. నేడు అత్యధికంగా కడప జిల్లా ఒంటిమిట్టలో 45°C ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. రాష్ట్రంలోని 244 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు.

ముఖ్య ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు..

ఒంటిమిట్ట (కడప): 45.0°C

గూడూరు (కర్నూలు), ఆళ్లగడ్డ (నంద్యాల): 44.3°C

తెరన్నపల్లి (అనంతపురం): 44.1°C

వరదయ్యపాలెం (తిరుపతి): 43.5°C


వడగాడ్పుల హెచ్చరిక..

రేపు (ఆదివారం) పలు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, కురుపాం, పాలకొండ, సాలూరుతో సహా మొత్తం 15 మండలాల్లో ఈ ప్రభావం ఉందని చెప్పుకొచ్చారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, బాడంగి, రామభద్రాపురం సహా 7 మండలాలు ఉన్నాయని వెల్లడించారు.

సాధారణ వడగాడ్పులు..

విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని మరో 25 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు.


ప్రజలకు ఆరోగ్య సూచనలు.. జాగ్రత్తలు..

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించాలని ప్రఖర్ జైన్ సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా టోపీ లేదా రుమాలు ధరించాలని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం (Sugar), రక్తపోటు (BP) ఉన్నవారు ఎండలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని పేర్కొన్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. పొలాల్లో పనిచేసే వారు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏపీలో ఒకే సమయంలో అటు ఎండలు, ఇటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నందున ప్రజలు వాతావరణానికి సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

నారీ శక్తి వందన్ బిల్లుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.. మంత్రి సత్యకుమార్ ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 18 , 2026 | 08:04 PM