తీవ్రవాయుగుండం ప్రభావం.. ఆ జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవులు
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:47 AM
తీవ్రవాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
విశాఖపట్నం, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): తీవ్రవాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
విశాఖపట్నంలో..
విశాఖపట్నంలో గడిచిన 24గంటల నుంచి కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో స్కూల్స్‌కు ఈరోజు (గురువారం) విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడైనా ప్రజలకు, ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో ...
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. ఉదయం 4గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా గాలులు భీకరంగా వీస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లా అంతటా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కాగా, శ్రీకాకుళం జిల్లాలో గాలుల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. శ్రీకాకుళం, చిలకపాలెం, అమదాలవలస, పాతపట్నంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులు నిలకడగా ప్రవహిస్తున్నాయి.
విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లాలోని ఇవాళ పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. నేడు మన్యం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
అయితే, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో భారీ వర్షం కురుస్తోంది.గంట్యాడ, చీపురుపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి.
కలింగపట్నం సమీపంలో తీరం దాటిన తీవ్రవాయుగుండం
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర వాయుగుండం తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 2 గంటల సమయంలో కళింగపట్నం-పోలాకి మధ్య నైరుతి దిశలో తీరం దాటిందని చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాలపై తీవ్రవాయుగుండం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఇది వాయవ్య దిశగా కదులుతుందని వివరించారు. దీని ప్రభావంతో, పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వానల నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. యానం, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ ఈస్ట్, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఒడిశా నుంచి మధ్య, ఉత్తర భారతం వైపు వెళ్లి.. ఈ నెల 25వ తేదీలోగా వాయుగుండం క్రమేపీ బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలోని నదులకు వరద హెచ్చరికలను కేంద్ర సంఘం జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
తుఫాన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News