తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:49 AM
తుఫాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎస్, డీజీపీతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్, డీజీపీతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తుఫాన్ ఇవాళ మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం – కవిటి మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అధికారులు వివరించారు.
24, 25 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..
తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అన్నారు. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు వివరించారు. ఈ నెల 24, 25వ తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు తీసుకోవాలి: సీఎం
261 మండలాల్లో భారీ వర్షం, 121 మండలాల్లో సాధారణ వర్షం, 9 మండలాల్లో అతి భారీ వర్షం, 2 మండలాల్లో తీవ్ర వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకల్లో ఆకస్మిక ప్రవాహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి... రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి: పవన్ కల్యాణ్
తుఫాన్ హెచ్చరికలు, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆదేశించారు. ఈరోజు (బుధవారం) అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మార్గనిర్దేశం చేశారు. అవసరం ఉన్న చోట పునరావాస శిబిరాల నిర్వహణలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్రపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే హెచ్చరికలు ఉన్నాయని.. ఈక్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి: డిప్యూటీ సీఎం
భారీ వర్షాల కారణంగా కల్వర్టులు దెబ్బతినడం, గ్రామీణ రహదారులు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. వరదల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట నిర్వహించే పునరావాస కేంద్రాల్లో పాలు పంచుకోవాలని నిర్దేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, మందులు, ఇతర మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HAM మోడల్‌తో చాలా వినూత్నంగా ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News