స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:25 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తగ్గేదేలేదని స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తగ్గేదేలేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన కుటుంబ సభ్యుడేనని తెలిపారు. కుటుంబ సమస్యలు నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుందామని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుందామని ధీమా వ్యక్తం చేశారు. అహంకారం పక్కనపెట్టి ప్రజల్లో ఉందామని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా పరిటాల రవీంద్ర పోరాడారు..
ఈరోజు (మంగళవారం) అనంతపురం జిల్లాలోని రాప్తాడులో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతలతో లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా పరిటాల రవీంద్ర పోరాడారని కొనియాడారు. అరాచకాలను భూస్థాపితం చేసిన నాయకుడు పరిటాల రవి అని కీర్తించారు. మెగా డీఎస్పీపై వైసీపీ నేతలకు కోర్టులు చివాట్లు పెట్టాయని.. అయినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధిరాలేదని ఆగ్రహించారు.
గొడ్డలితో బతికే వారు గొడ్డలితోనే పోతారు..
రాయలసీమలో మహిళలపై దాడులకు పాల్పడుతున్న ఆనాటి పాలకులకు పరిటాల రవి ఫుల్‌స్టాప్ పెట్టారని లోకేశ్ ప్రస్తావించారు. వైసీపీ హయాంలో తన పాదయాత్రను అడ్డుకునేందుకు జీవోలు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. నందమూరి బాలకృష్ణను మూడుసార్లు గెలిపించి శాసనసభకు పంపించిన ఘనత అనంతపురం జిల్లాది అని ఉద్ఘాటించారు. గొడ్డలితో బతికే వారు గొడ్డలితోనే పోతారని ఎద్దేవా చేశారు. పాఠాలు చెప్పే టీచర్లపై వైసీపీ నేతలు ఎలా దాడి చేశారో మనం చూశామని పేర్కొన్నారు.
డీఎస్సీపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం..
‘డీఎస్సీపై నేను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని... జగన్ నువ్వు సిద్ధమా’ అని లోకేశ్ సవాల్ చేశారు. జగన్‌లాగా తాము విదేశాలకు వెళ్లాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవడం లేదని విమర్శించారు. తాము నీతి నిజాయితీగా బతికామని ఉద్ఘాటించారు. వైసీపీలో కొన్ని రౌడీ మూకలు ఉన్నాయని.. టీచర్లపై కోడిగుడ్లు వేసి దాడి చేస్తారా..? అని ఆగ్రహించారు. టీచర్లపై దాడి చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లు రెడ్ బుక్కులో రాసుకున్నానని తెలిపారు. రెడ్ బుక్కులో ఉన్న వారిని వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు.