Share News

తుఫాను వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

ABN , Publish Date - Sep 23 , 2026 | 08:09 AM

తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులను ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అప్రమత్తం చేశారు.

 తుఫాను వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
AP Minister BC Janardhan Reddy

అమరావతి, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులను ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) అప్రమత్తం చేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈదురు గాలులకు రహదారులపై విరిగిపడే చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు జేసీబీలు, రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈరోజు (బుధవారం) సచివాలయంలో అధికారులతో మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడారు.


తుఫాను కారణంగా ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా, ప్రత్యామ్నాయ దారులను ముందే గుర్తించి, ట్రాఫిక్‌‌ను క్లియర్ చేయాలని మంత్రి జనార్దన్ రెడ్డి సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, గెడ్డలు, కాజ్‌వేల వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారులకు గండ్లు పడితే తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు.


అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ అధికారులు అంతా జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. సరిగా లేని వంతెనలపై నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించాలని, అవసరమైతే రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.

Updated Date - Sep 23 , 2026 | 08:21 AM