సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 07 , 2026 | 06:27 PM
సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మనం అంతా కలిసి ఉంటే అన్నింటినీ జయించవచ్చని పేర్కొన్నారు.
కొడంగల్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మనం అంతా కలిసి ఉంటే అన్నింటినీ జయించవచ్చని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీమ్పేటలో రైతుమేళాను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఆనాడు కరోనా సమయంలో కేసీఆర్ క్రోసిన్ గోలి వేసుకొమ్మన్నారని.. ఆయన మాట విన్నవాళ్లు సచ్చిపోయారని తెలిపారు. తమ హయాంలో రైతులు లాభాలు పొందుతున్నారని తెలిపారు. అప్పట్లో కేసీఆర్ పాలమూరు నుంచి గెలిస్తే.. తెలంగాణ వస్తుందని.. ఈ జిల్లా బాగుపడుతుందని ఆయనను ఎంపీగా గెలిపించామని అన్నారు. తెలంగాణ వచ్చి.. కేసీఆర్ సీఎం అయినా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే.. పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 30 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని తెలిపారు.
కేసీఆర్ హయాంలో కొడంగల్‌కు ఏం ఇచ్చారు.
అప్పట్లో గోదావరి జలాలు ఇక్కడికి తీసుకురావాలని.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టారని.. ఇందుకోసం రూ.15 వేల కోట్ల ఖర్చు చేశారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సరిదిద్దేందుకు తాము చర్యలు చేపడితే.. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద మోకరిల్లి సీబీఐ విచారణను అడ్డుకున్నారని ఆరోపించారు. ఆనాడు హరీశ్‌రావు గవర్నర్‌ను తీసుకుపోయి కాళేశ్వరంపై భజన చేయించుకున్నారని.. ఇప్పుడు మేడిగడ్డ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నో ఇబ్బందులున్నా గోదావరి నీటిని రైతులకు తాము అందిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తాము వదిలామని బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతికి కాళేశ్వరం బలై పోయిందని.. కాంగ్రెస్ హయాంలో కట్టిన దేవాదుల ప్రాజెక్టు నుంచే నీళ్లు వస్తున్నాయని ప్రస్తావించారు. అసెంబ్లీలో ఎల్‌నినోపై చర్చ పెట్టాలని తామే తొలుత అనుకున్నామని అన్నారు. గతంలో 22ఏ పై బీఆర్ఎస్ నేతలు అవాకులు, చెవాకులు పేలారని .. అసెంబ్లీలో తాము చర్చ పెట్టామని తెలిపారు. ఎల్‌నినోపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్‌ను కోరారు. కేసీఆర్ హయాంలో కొడంగల్‌కు ఏం ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నియోజకవర్గంలో బడి, గుడి, సరైన రోడ్లు లేవని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కొడంగల్‌కు ఇచ్చింది ఏమీలేదని.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడకు వచ్చి తనను ఓడించాలని చెప్పి అభివృద్ధిని మాత్రం మరిచారని ధ్వజమెత్తారు.
కొడంగల్‌కు ఎన్నో ప్రాజెక్టులు వస్తాయి..
ఇక్కడ టస్సర్ కార్మికులకు రావాల్సిన అభివృద్ధి నిధులను సిరిసిల్లకు తీసుకు పోయారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కొడంగల్ ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని... తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే.. వారికి ఎందుకంతా కడుపుమంట అని ఆగ్రహించారు. కొడంగల్‌కు ఇన్నాళ్లుగా ఏ పదవి రాలేదని.. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో తనకు సీఎం పదవి వచ్చిందని ప్రస్తావించారు. ఈనాడు ఢిల్లీ పక్కనున్న నోయిడా.. ముంబై పక్కనున్న పుణెలో ఎలా అభివృద్ధి జరిగిందో.. మన కొడంగల్ అలా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతానికి ఎన్నో ప్రాజెక్టులు వస్తాయని అన్నారు. మన పిల్లలు ఇంటర్ చదవాలన్నా సుదూర ప్రాంతాలకు పోయేవారని.. కానీ త్వరలో అన్ని ప్రాంతాల నుంచి చదువుకునేందుకు కొడంగల్‌కు వస్తారని చెప్పుకొచ్చారు. ఇక్కడ పండే కందులు, జొన్నలకు ప్రాముఖ్యం రావాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే తన తాపత్రాయమని వ్యాఖ్యానించారు.
దేశానికే మోడల్‌గా కొడంగల్ నిలుస్తుంది..
కొడంగల్ ఇతరులు అసూయ పడేలా దేశానికే ఓ మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. రూ.9 వేల కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతాయని వెల్లడించారు. అందరికీ రేపు దీపావళి అయితే.. కొడంగల్‌కు ఈరోజే దీపావళి వెలుగులు నింపుతోందని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ని వేషాలేసినా .. తనలా కాలేరని అన్నారు. బీఆర్ఎస్ను జనం నమ్మరని.. వారు చేసిన అవినీతిని ఇంకా మరువలేదని చెప్పారు. తాము ఆరోజు ఏడు రకాల సన్నాలు పండించమంటే.. తమ మాట విన్న రైతులకు ఇప్పుడు రూ.4 వేలు చెల్లించి ధాన్యం కొంటున్నామని తెలిపారు. అన్నదాతలు ఆరుతడి పంటలు మాత్రమే వేయ్యాలని.. వరి పంట వేస్తే నీళ్లు సరిపోవని అన్నారు. జులై వరకు వానలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని.. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మరో ఐదు పట్టణాలకు ఇందిరమ్మ ఇళ్లు
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు: సీఎం డీకే శివకుమార్
మైనార్టీల విద్య, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News