ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం
ABN , Publish Date - Oct 12 , 2026 | 10:58 AM
ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ మహోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఖమ్మం జిల్లా, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ మహోత్సవాన్ని ఈరోజు (సోమవారం) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మహోత్సవ ఏర్పాట్లను స్వయంగా మంత్రి తుమ్మల పర్యవేక్షించారు. 50 వేల మంది భక్తులకు భోజనం, స్వామివారి మహాప్రసాదం అందజేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న రామానుజ చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో భూమిపూజ మహోత్సవం, శిలాన్యాస పూజ చేశారు. ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.

శ్రీవారి ఆలయం నిర్మించడం తన పూర్వజన్మ సుకృతం: మంత్రి తుమ్మల
ఖమ్మంలో ఈ ఆలయం నిర్మించడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ఈ మహత్కార్యానికి, భద్రాచల రామాలయం పునర్నిర్మాణానికి చిన్న జీయర్ స్వామి అంకురార్పణ చేశారని ప్రస్తావించారు. వేంకటేశ్వరస్వామి నిర్మాణం చిన్నజీయర్ స్వామి మంగళాశాసనంతో జరుగుతోందని తెలిపారు. చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో ఏ కార్యక్రమం చేపట్టిన దిగ్విజయం అవుతుందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులకు కృతజ్ఞతలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం సుభిక్షంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

ఈ ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల విశేషంగా కృషి చేశారు: చిన్నజీయర్ స్వామి
ఈ ఆలయ నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశేషంగా కృషి చేశారని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. ఈ మహోత్సవంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మంత్రి తుమ్మలది ధార్మిక కుటుంబమని.. వారికి శ్రీవారు ఎల్లవేళలా అండగా ఉండాలని మంగళాశాసనం చేస్తున్నామని అన్నారు. ఖమ్మంలో ఆరాధనలు అందుకోవటానికి ఇక్కడకు రావటం జరిగిందని తెలిపారు. శిలాన్యాస కార్యక్రమంలో మనమంతా పాల్గొనడం అదృష్టమని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లా రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్యలో ఉందని వెల్లడించారు. ఇరు రాష్ట్రాలు రాజకీయంగా వేర్వేరు అయినా భక్తి విషయంలో ఒక్కటేనని చెప్పారు. ఖమ్మంలో టీటీడీ ఆలయం నిర్మించడానికి ముందుకు వచ్చి అనుమతి ఇచ్చిన ఛైర్మన్ బీఆర్ నాయుడుకు మంగళాశాసనం చేస్తున్నామని అన్నారు. శ్రీనివాసుడు ఖమ్మంలో మొదటి అడుగు వేశారని తెలిపారు. శ్రీవారు ఆశ్వీజమాసం (సోమవారం) తిరుమల కొండపైకి వచ్చారని ప్రస్తావించారు. ఇవాళ ఖమ్మంలో స్వామి అడుగుపెట్టారని అన్నారు. రామానుజచార్యులవారు ప్రతి శుక్రవారం అభిషేకం చేసే క్రతువు ఏర్పాటు చేశారని చిన్నజీయర్ స్వామి వెల్లడించారు.

పట్టువదలని విక్రమార్కుడిలా మంత్రి తుమ్మల ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేశారు: బీఆర్ నాయుడు
భారతదేశవ్యాప్తంగా ఐదువేల ఆలయాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. పట్టువదలని విక్రమార్కుడిలా మంత్రి తుమ్మల ఈ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి కృషి చేశారని కొనియాడారు. అస్సాం, బిహార్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీనివాసుడి ఆలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి ఇంత విలువైన భూమి కేటాయించడం సంతోషమని అన్నారు. శ్రీవారి నిర్మాణానికి భక్తులు విశేషంగా సహకారం అందిస్తున్నారని బీఆర్ నాయుడు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సిబ్బందికి ప్రమాదం
యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News