Share News

యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:23 AM

సిద్దిపేట యువతతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్ గేమ్స్, డ్రగ్స్‌, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని, లక్ష్య సాధనకు టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి, సిద్దిపేటలో నాణ్యమైన కోచింగ్ వంటి అంశాలపైనా మాట్లాడారు.

యువత రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్‌లో బతకాలి: హరీశ్‌రావు
Harish Rao

సిద్దిపేట జిల్లా, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట యువతతో ఈరోజు (ఆదివారం) నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) పలు సూచనలు చేశారు. రీల్ లైఫ్ కాదని.. రియల్ లైఫ్‌లో బతకాలని యువతకు మార్గనిర్దేశం చేశారు. వారు ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో పడొద్దని.. డ్రగ్స్‌, వ్యసనాలకు దూరంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. యువత లక్ష్యాన్ని చేరుకోవాలంటే టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమని తెలిపారు. లక్ష్యంపై దృష్టి పెట్టాలని.. అప్పుడే విజయం సాధ్యమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సిద్దిపేటలో నాణ్యమైన కోచింగ్ వంటి పలు అంశాలపైనా హరీశ్‌రావు మాట్లాడారు.


తెలంగాణ అభివృద్ధిపై..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అభివృద్ధిలో సమూల మార్పునకు కారణమైందని హరీశ్‌రావు తెలిపారు. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి నీళ్లు రావన్నవాళ్లే.. ఇప్పుడు కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు అభివృద్ధికి గుండెకాయలయ్యాయని అంటున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చాక పంట దిగుబడులు భారీగా పెరిగాయని వెల్లడించారు. ఒకప్పుడు భూమి, ఆస్తి.. ఇప్పుడు ఆదాయ వనరు అని చెప్పుకొచ్చారు.


మాజీ సీఎం కేసీఆర్ విజనరీ పర్సన్..

మాజీ సీఎం కేసీఆర్ విజనరీ పర్సన్.. ఫైటర్ అని హరీశ్‌రావు అభివర్ణించారు. తెలంగాణ భవిష్యత్తు అద్భుతమని.. దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. పదవుల కోసం ఈ రాష్ట్ర నినాదాన్ని వాడుకోలేదని చెప్పారు. పదవులను త్యాగం చేసి ఉద్యమాన్ని నడిపించారని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయని వివరించారు.


సిద్దిపేటతో అనుబంధం..

సిద్దిపేట ప్రజలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తాను ఏడుసార్లు పోటీ చేస్తే.. ఆరుసార్లు ప్రత్యర్థులకు డిపాజిట్ రాలేదని చెప్పారు. ఇక్కడి ప్రజలకు ఎదిగిన కొడుకులాంటి వాడిగా ఉంటానని అన్నారు. సిద్దిపేట ప్రేమకు, ఆతిథ్యానికి నిలయమని తెలిపారు. ఒకప్పుడు ఎన్నికల నినాదాలుగా ఉన్న గోదావరి జలాలు, జిల్లా ఏర్పాటు, రైలు కలలను నిజం చేసుకున్నామని వెల్లడించారు.


సిద్దిపేటలోనే నాణ్యమైన కోచింగ్..

హైదరాబాద్‌లో లభించే నాణ్యమైన కోచింగ్‌ను సిద్దిపేట యువతకు ఇక్కడే అందిస్తున్నామని వివరించారు. యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమని చెప్పారు. స్వతంత్రంగా నిలబడగలిగినప్పుడే జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని హరీశ్‌రావు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర

జగన్ అక్రమాస్తుల కేసుల్లో వేగం పెంచాలి.. తెలంగాణ హై కోర్టులో ఈడీ పిటిషన్

203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా: ఎన్టీఆర్ ట్రస్టు చర్యలు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 10:29 AM